టీడీపీకి తుమ్మల రాజీనామా

 

ఖమ్మం జిల్లాకి చెందిన తెలుగుదేశం నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీకి శనివారం నాడు రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీకి సేవలు చేసిన తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్ద నష్టం. గత కొంతకాలంగా తుమ్మల నాగేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. జిల్లాలో నామా నాగేశ్వరరావుతో పడకపోవడం వల్లే తుమ్మల తెలుగుదేశాన్ని వీడినట్టు తెలుస్తోంది. కాగా, గత కొంతకాలంగా అనారోగ్యంగా వుండి హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందిన తుమ్మలను చంద్రబాబుతో సహా పలువురు తెలుగుదేశం నాయకులు పరామర్శించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్చి అయిన తర్వాత ఖమ్మంలోని తెలుగుదేశం కార్యాలయానికి వెళ్ళిన తుమ్మల తాను తెలుగుదేశం పార్టీలో కొనసాగేదీ లేనిదీ సెప్టెంబర్ 5న ప్రకటిస్తానని చెప్పారు. అంతలోనే తెలుగుదేశం పార్టీకి తన రాజీనామా లేఖను పార్టీ నాయకుడు చంద్రబాబుకు పంపించారు. ‘నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నాను’ అని ఏక వాక్యంతో ఆయన రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించారు. తుమ్మల నాగేశ్వరరావుతోపాటు ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు తెలుగుదేశం నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. కాగా, తెలుగుదేశం పార్టీని వీడిన తుమ్మల త్వరలో టీఆర్ఎస్‌లో చేరబోతున్నారని, త్వరలో జరిగే తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో తుమ్మలకు స్థానం దక్కే అవకాశం వుందని తెలుస్తోంది.