TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అధికార పార్టీలో ఆయనది అతిథి పాత్రేనా?

Published on: Sat Jun 14, 2025 12:36PM

ఖమ్మం జిల్లాలో సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  అధికార పార్టీలో అతిథి పాత్రకే పరిమితం అవుతున్నారు.  గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన తుమ్మల, ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.  ఆ తరువాత మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. ఎన్నికల సమయంలోనే పాత కాంగ్రెస్ నాయకులు కొందరు ఆశించిన రీతిలో తుమ్మలకు సహకరించలేదు. అయితే ఎన్నికల సమయంలో ఆ విషయంలో తుమ్మల ఆచితూచి వ్యవహరించారు.  ఎన్నికల తర్వాత కూడా   అదే వైఖరిని కొనసాగించారు. కొనసాగిస్తున్నారు. దీంతో నామినేటెడ్ పదవుల విషయంలో తుమ్మల సీనియర్ కాంగ్రెస్ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వమని మాత్రమే అధిష్ఠానానికి సూచించారు. జిల్లాలో మిగిలిన ఇద్దరు మంత్రులు మాత్రం తమ వర్గానికి పదవులు ఇప్పించడంలో కీలకపాత్ర పోషించారు.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ముందు పార్టీలో చేరినా కాంగ్రెస్ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.  నిత్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలివిడిగా ఉంటూ తన అనుచరులకు పదవులు ఇప్పించుకున్నారు.

ఇక ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాత్రం  ఇతర నియోజకవర్గాల్లో ఉన్న తన వర్గీయులకు పదవు లు ఇప్పించడంలో పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో పొంగులేటి చురుగ్గా పాల్గొంటున్నారు. తుమ్మల, భట్టి మాత్రం పరిమితంగానే హాజరవుతున్నారు. రాష్ట్ర స్థాయి పార్టీ వ్యవహారాల్లో తుమ్మల ఎక్కడా కనిపించడం లేదు.. అధిష్ఠానం పెద్దలు వచ్చిన సమయంలో టీపీసీసీ ఆహ్వానం మేరకే కార్యక్రమాలకు హాజరవుతున్నారు. దీంతో అధికార పార్టీలో తుమ్మల కేవలం అతిథి పాత్ర పోషిస్తున్నారన్నఅ భిప్రాయం వ్యక్తం అవుతోంది.

స్వతహాగా కూడా తుమ్మల తన పరిధిలోని కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటారు. ఇతర విషయాలపై ఆయన పెద్దగా దృష్టి సారించరనే పేరుంది. ఇది తన రాజకీయ జీవితంలో ఒక ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. మిగతా ఎమ్మెల్యేలు ఎవరైనా ఆహ్వానిస్తేనే ఆయా నియోజకవర్గాల్లో పర్యటనలకు వెళతారు.  ఒకవేళ తాను ఆయా నియోజకవర్గాల్లో వ్యక్తిగత కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వచ్చినా సంబంధిత ఎమ్మెల్యేలకు ముందుగానే సమాచారం ఇచ్చి వెళతారు. దీంతో ఆయన పట్ల ఎమ్మెల్యేలు గౌరవంగా ఉంటారు.