తితిదే బోర్డులో సభ్యత్వం కోసం నేతల పోటీలు

 

ప్రజాసేవకే కాదు దేవుడి సేవకీ ఈ రోజుల్లో పోటీ పెరిగిపోయింది. స్వామి కార్యంతో బాటే స్వకార్యం కూడా నెరవేరుతుంది గాబట్టే దానికీ డిమాండ్ పెరిగిపోయింది. ఇంతకీ విషయం ఏమిటంటే, ఆగస్ట్ నెలలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన తరువాత ఇంతవరకు దానికి కొత్త బోర్డును నియమించలేదు. ఈ నెలాఖరులోగా ఆపని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఇంతవరకు తితిదే బోర్డులో చైర్మన్ తో కలిపి మొత్తం 15మంది సభ్యులు ఉండేవారు. కానీ ఇప్పుడు తెలంగాణాకు కూడా బోర్డులో సభ్యత్వం కల్పించాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ సంఖ్యను 18కి పెంచేందుకు సిద్దమయ్యారు. అయితే మరో 18 సీట్లు పెంచినా కూడా సరిపోయేలా కనబడటం లేదు. కారణం తితిదే బోర్డులో సభ్యత్వం కోసం పోటీ పెరిగిపోవడమే.

 

ఏపీ మరియు తెలంగాణా రాష్ట్రాలకు చెందిన తెదేపా నేతలకు పోటీగా బీజేపీ నేతలు కూడా వస్తున్నారు. వారు కాకుండా తెలంగాణా ప్రభుత్వం తరపున బోర్డులో చోటు కల్పించాలని కొందరు తెరాస నేతలు కోరుతున్నట్లు సమాచారం. ఆంధ్రాకు మూడు, తెలంగాణాకు మూడు సీట్లు అనుకొన్నప్పటికీ, రెండు రాష్ట్రాలలో ఆ ఆరు సీట్లకీ చాలా మందే పోటీ పడుతున్నారు. వారు సరిపోరన్నట్లు బీజేపీ నేతలు కూడా తమకూ బోర్డులో అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

 

ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలకే కాక దక్షిణాదిన ఉన్న తమిళనాడు, కర్ణాటక మరియు కేరళ రాష్ట్రాల నుండి కూడా ఒక్కో సభ్యుడిని బోర్డులో తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అంటే ఆ మూడు రాష్ట్రాలకి మూడు సీట్లు పోయాయన్నమాట. తెలంగాణా తెదేపా నేతలు తమకు కనీసం మూడు సీట్లు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు రెండు సీట్లు మాత్రమే కేటాయించాలని భావిస్తున్నారు. ఇప్పుడు బీజేపీ నేతలు కూడా బరిలోకి దిగడంతో తెలంగాణా తెదేపా నేతలు తమ సీట్లను బీజేపీ ఎక్కడ ఎగరేసుకు పోతుందో అని ఆందోళన చెందుతున్నారు. తెలంగాణా తెదేపా నేతలు సండ్ర వీరయ్య, జి. సాయన్నలతో సహా మరి కొంత మంది పోటీలో ఉన్నారు. ఇక ఆంధ్రాలో అయితే ఆ లిస్టు చేంతాడంత పొడవు ఉంది. గాలి ముద్దు కృష్ణం నాయుడు, సి.యం. రవిశంకర్, చదలవాడ, భాను ప్రకాష్ రెడ్డి, తదితరులు పోటీలో ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నుండి మరో ముగ్గురు పోటీలో ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెలాఖరులోగా తితిదే బోర్డును ఏర్పాటు చేయవచ్చును. దానిలో ఎవరెవరికి అవకాశం దొరుకుతుందో వేచి చూడాలి.