ఆడవాళ్లను రక్షిస్తున్న ఓ కార్టూన్...

 

లైంగిక వేధింపులు ఏ దేశానికీ కొత్త కాదు! స్త్రీని దేవతలా పూజిస్తామని చెప్పే భారతదేశంలో అయినా, అభివృద్ధి చెందామని చెప్పుకునే అమెరికాలో అయినా... ఆడవాళ్లకి వేధింపులు తప్పవు. నడిరోడ్డు దగ్గర్నుంచీ ఆఫీసు వరకు ఎక్కడైనా వారిని వేధించేందుకు ఓ ఆకతాయి కాచుకుని కూర్చుంటాడు. కానీ జపాన్లో చేపట్టిన ఓ ప్రచారం ఇలాంటి వేధింపుల నుంచి ఆడవారికి రక్షణగా నిలుస్తోందట!

 

జపాన్లో ఐచీ (Aichi) అనే రాష్ట్రం ఉంది. మిగతా ప్రదేశాలలో ఉన్నట్లే అక్కడా లైంగిక వేధింపులు పెచ్చుమీరిపోతున్నాయి. వీటిని ఎలా అదుపు చేయాలా అని తలలు పట్టుకున్న పోలీసు అధికారులకి ఓ ఆలోచన వచ్చింది. అంతే! వెంటనే సుహోకీ షోజో (Tsuuhokei Shojo) అనే పాత్రని సృష్టించారు. సుహోకీ షోజో అంటే ‘ఫిర్యాదు చేసే అమ్మాయి’ అని అర్థం.

 

పేరుకి తగినట్లుగానే ఈ పాత్ర ఏదన్నా వేధింపు ఎదురైనప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియచేస్తుంది. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్టు! సాధారణంగా బాధితులే తమని వేధిస్తున్నవారిని ఎదుర్కోవాలనో, వారి గురించి హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయాలనో చెబుతూ ఉంటారు. కానీ వేధింపులని ఎదుర్కొన్న బాధితులు ఒకరకమైన షాక్లోనూ, అయోమయంలోనూ ఉంటారు. అందుకనే కేవలం 12 శాతం మంది బాధితులు మాత్రమే, తమంతట తాముగా ఫిర్యాదు చేసేందుకు ముందుకు వెళ్తారట. సరిగ్గా ఈ సమస్య మీదే దృష్టి పెట్టారు ఐచీ పోలీసులు.

 

ఐచీ పోలీసులు సృష్టించిన పాత్ర లైంగిక వేధింపులని చూసినవారెవ్వరైనా సరే రంగంలోకి దిగాలంటూ సూచిస్తుంది. ఈ సూచనలు తెలియచేస్తూ పోలీసులు కొన్ని వందల పోస్టర్లను ముద్రించి ఐచీ అంతటా ఉంచారు. ఈ పోస్టరులో కనిపించే ‘సుహోకీ షోజో’ పాత్ర మూడు సూచనలు చేస్తుంది.

 

- ఎవరన్నా మీ ముందు లైంగిక వేధింపుని ఎదుర్కొంటూ ఉంటే.. వెంటనే వెళ్లి బాధితురాలికి సాయంగా నిలబడండి! దీనివల్ల బాధితురాలికి తాను ఒంటరిదాన్ని కాదన్న ధైర్యం వస్తుంది. ఆకతాయికి గట్టిగా సమాధానం చెప్పగలుగుతుంది. ఒకరికి ఇద్దరు ఉంటే ఆకతాయిలు కూడా అక్కడి నుంచి తోకముడుస్తాడు.

 

- అండగా నిలబడినా కూడా ఆకతాయి వెనక్కి తగ్గకపోతే... దగ్గరలో ఉన్న పోలీసు ఎవరికన్నా విషయాన్ని తెలియచేయండి.

 

- అదీఇదీ కాదంటారా! జపాన్లో లైంగిక వేధింపుల కోసం ప్రత్యేకంగా 110 నెంబరు ఉంది. ఆ నెంబరుకి ఫిర్యాదు చేస్తే సరి.

 

‘సుహోకీ షోజో’తో రూపొందించిన పోస్టర్లు అద్భుతాలు చేశాయని వేరే చెప్పాల్సిన పనిలేదు కదా! ఈ పోస్టర్లలో స్నేహపూర్వకంగా కనిపించే కార్టూన్ పాత్రా, ఆ పాత్ర ఇచ్చే ధైర్యం అసమాన్యం అంటున్నారు. ఇప్పటిదాకా దారినపోయే దానయ్యలుగా ఉండి చోద్యం చూసేవారంతా... బాధితులకు అండగా నిలిచేందుకు ముందుకు వస్తున్నారు.

- నిర్జర.