కారులో కూర్చొని నివేదిక తయారీ! ఈటల కేసులో హైకోర్టు సీరియస్ 

posted on: May 4, 2021 3:53PM

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ భూముల్లో ప్రభుత్వం సర్వే జరిపిన తీరును తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. సర్వే చేసే ముందు ఆయనకు నోటీసు ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సహజ న్యాయసూత్రాలను అధికారులు తీవ్రంగా ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. జమున హేచరీస్‌ భూములు, వ్యాపారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సంస్థపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ కుటుంబం హైకోర్టులో వేసిన అత్యవసర పిటిషన్‌పై విచారణ జరిగింది. నివాసంలోనే న్యాయమూర్తి జస్టిస్‌ వినోద్‌కుమార్‌ విచారణ చేపట్టారు. ఈటల కుటుంబం తరఫున సీనియర్‌ న్యాయవాది దేశాయి ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. సర్వే చేసే ముందు తమకు నోటీసు ఇవ్వలేదని ఈటల కుటుంబం న్యాయస్థానానికి వివరించింది. అధికారులు తమ భూముల్లోకి అక్రమంగా చొరబడ్డారని తెలిపింది. కలెక్టర్‌ నివేదిక కూడా తమకు ఇవ్వలేదని చెప్పింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్  ప్రసాద్‌ వాదనలు వినిపించారు. ఈటలపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినందునే విచారణ జరిపామని న్యాయస్థానానికి వివరించారు. 

వాదనలు విన్న హైకోర్టు.. సర్వే చేసేందుకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదా.. రాత్రికి రాత్రే సర్వే ఎలా పూర్తయింది. ఫిర్యాదు వస్తే ఎవరి ఇంట్లోకైనా వెళ్లి విచారణ చేయొచ్చా? అని ప్రశ్నించింది. అధికారులు కారులో కూర్చొని నివేదిక రూపొందించినట్లు కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై స్పందించిన అడ్వొకేట్‌ జనరల్‌ పూర్తిస్థాయి విచారణ జరగలేదని వివరించారు. ప్రాథమిక విచారణ మాత్రమే చేసినట్లు తెలిపారు. తదుపరి చర్యలు చట్టప్రకారమే ఉంటాయని కలెక్టర్‌ నివేదికలో తెలిపారని ఏజీ హైకోర్టుకు వివరించారు. పిటిషనర్లది కేవలం ఆందోళన మాత్రమేనన్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...