గులాబీ  పార్టీలో కేటీఆర్ సీఎం గోల! రాజకీయ డ్రామాలంటున్న విపక్షాలు 

కేటీఆర్‌ సీఎం కావాలంటూ  టీఆర్‌ఎస్‌లో గొంతులు పెరుగుతున్నాయి.  పోటీపడి మరీ గులాబీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో పాటు మంత్రులు అదే పాట పడుతున్నారు. కేటీఆర్‌ సీఎం ఐతే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ కు  అనుకూలంగా మూడు రోజుల క్రితం సీనియర్ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడగా..  బుధవారం మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్ కూడా ముఖ్యమంత్రిగా కేటీఆర్ కు  జై కొట్టారు. కేటీఆర్‌ సీఎం అయితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌,  నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌.  వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ కూడా కేటీఆర్‌ ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే కూడా ముఖ్యమంత్రి పదవికి కేటీఆర్ అన్ని విధాలా అర్హుడని మంగళవారం కామెంట్ చేశారు.  నేతల వరుస ప్రకటనలతో టీఆర్‌ఎస్ లో  కేటీఆర్ అంశమే హాట్‌ టాపిక్‌గా మారింది. 

తెలంగాణ ప్రభుత్వంలో కీలక మార్పులు ఉంటాయని కొంత కాలంగా ప్రచారం జరుగుతుండటం, తాజాగా టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రకటనలతో కేటీఆర్ పట్టాభిషేకం ఖాయమే అన్న చర్చ జరుగుతోంది. అయితే కేసీఆర్ కు అత్యంత సన్నిహితుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం  కేటీఆర్ కు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం ఇప్పట్లో జరిగే సూచనలు కనిపించడం లేదంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో కేటీఆర్ ను సీఎం చేయాలన్న ఆలోచనపై కేసీఆర్ వెనక్కి తగ్గారని చెబుతున్నారు. ఇటీవల కాలంలో కేసీఆర్ పై జనాల్లో వ్యతిరేకత బాగా పెరిగింది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో ఓటమి, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో పలితం రాకపోవడానికి అదే కారణమని కూడా తేలింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా రివర్స్ అయ్యాయి. తన నైజానికి భిన్నంగా కొన్ని పథకాలను కూడా క్యాన్సిల్ చేశారు కేసీఆర్. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పగ్గాలు కేటీఆర్ కు అప్పగిస్తే... పాలన చేతకాక కేసీఆర్ పారిపోయారని విపక్షాలు ఆరోపణలు చేసే అవకాశం ఉందన్న వాదన కూడా కొందరు గులాబీ నేతల నుంచి వస్తుందట. పోరాడి తెలంగాణ సాధించిన ఉద్యమ నేతగా , రాజకీయ వ్యూహాల్లో దిట్టగా పేరున్న కేసీఆర్ కు.. ఈ తరహా ప్రచారం ఇబ్బందిగా మారుతుందని వారు చెబుతున్నారట. అందుకే కేటీఆర్ ను సీఎం చేయాలన్న అంశంపై కేసీఆర్ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. 

కేటీఆర్ విషయంలో కేసీఆర్ వెనక్కి తగ్గడానికి  నిఘా వర్గాల నివేదికలు కూడా ఒక  కారణమని తెలుస్తోంది.  కేటీఆర్ ను సీఎం చేస్తే పార్టీలో ఎలా ఉంటుంది.. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి స్పందన ఉంటుందన్న దానిపై ఇంటిలిజెన్స్ తో సర్వే చేయించారట కేసీఆర్ . అందులో సంచలన విషయాలు వెల్లడయ్యాయని తెలుస్తోంది. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తే.. టీఆర్ఎస్ చీలిపోయే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించాయని చెబుతున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ రెండు వర్గాలుగా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉన్న నేతలంతా హరీష్ రావు కోటరిలో ఉండగా.. బంగారు తెలంగాణ బ్యాచ్ లీడర్లంతా కేటీఆర్ వెంట ఉన్నారనే చర్చ జరుగుతోంది. కేటీఆర్ ను సీఎం చేస్తే... ఉద్యమ నేతలంతా తమ దారి తాము  చూసుకునే అవకాశం ఉందని , హరీష్ రావు కూడా పార్టీ మారే అవకాశం ఉందని నిఘా సంస్థలు కేసీఆర్ కు నివేదిక ఇచ్చాయని తెలుస్తోంది. 

కేసీఆర్ పరిధిలో ఉండే రాష్ట్ర సంస్థలే కాదు కేంద్ర నిఘా సంస్థలు కూడా ఇదే విషయాన్ని నివేదించాయని చెబుతున్నారు. కేంద్ర సంస్థల సర్వే ఫలితాలు తెలుసు కాబట్టే.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా మరో మూడేళ్లు ముఖ్యమంత్రిగా కేసీఆరే కొన‌సాగుతార‌ని కచ్చితంగా చెబుతున్నారని రాజకీయ విశ్లేషకులు  అంచనా వేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో దూకుడు పెంచింది బీజేపీ. ఇతర పార్టీల నేతలకు వల వేస్తోంది. కారు పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను గుర్తించి తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు కమలం నేతలు. ఇలాంటి సమయంలో కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసి.. పార్టీలో అసమ్మతి పెరిగేలా చూసుకోవడం మంచిది కాదనే భావనకు టీఆర్ఎస్ అధినేత వచ్చారంటున్నారు. అందుకే  సర్వే నివేదికలు, పార్టీ ముఖ్యల సూచనలతో కేటీఆర్ ను సీఎం చేసే అంశంలో వెనక్కి తగ్గిన కేసీఆర్.. విపక్షాలను గందరగోళం పరిచేలా  కొత్త డ్రామా  అమలు చేస్తున్నారని చెబుతున్నారు. 

కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారాన్ని లైవ్ గా ఉంచుతూనే .. మరికొంత కాలం సాగదీయాలనే  ఎత్తుగడను గులాబీ బాస్ అమలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇందులో భాగంగానే పార్టీ ప్రజా ప్రతినిధులు కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలంటూ ప్రకటనలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ రకమైన ప్రచారం వల్ల పార్టీకి కూడా ప్రయోజనాలు ఉంటాయని గులాబీ బాస్ లెక్కలు వేస్తున్నారట. కేటీఆర్ సీఎం అవుతారనే ప్రచారంతో పార్టీ కేడర్ లో  జోష్ వస్తుందని.. అది త్వరలో జరగనున్న ఖమ్మం. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో పార్టీకి ఫ్లస్ అవుతుందని కేసీఆర్ భావిస్తున్నారట. అంతేకాదు పార్టీ  వర్కింగ్ ప్రెసిడెంట్లుగా హరీష్ రావు, ఈటెల రాజేందర్లను నియమిస్తారని జరుగుతున్న ప్రచారం వెనక కూడా  గులాబీ అధినేత ఉన్నారనే చర్చ  పొలిటికల్ సర్కిళ్లలో జరుగుతోంది. హరీష్ రావు, ఈటెలకు ఉద్యమకారుల మద్దతు ఉంది. ఇలా వారిని కూల్ చేయవచ్చన్నది కేసీఆర్ వ్యూహంగా చెబుతున్నారు.  మొత్తంగా చూస్తే మాత్రం కేటీఆర్ ఇప్పట్లో ముఖ్యమంత్రి కావడం ఉండకపోవచ్చన్నదే ప్రగతి భవన్ వర్గాల సమాచారంగా ఉంటోంది.