గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ హోర్డింగులు.. మెట్రో ఎక్కడా..?


 

హైదరాబాద్లో గ్రేటర్ ఎన్నికల జోరు బాగానే సాగుతుంది. ఏ పార్టీ వ్యూహాలు వారికి ఉన్నాయి. ఇక అధికార పార్టీ అయితే ఇప్పటికే హైదరాబాద్ లో సగం హోర్డింగులతో నింపేసింది. తమ ప్రభుత్వం చేపట్టిన పథకాలు.. సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి వివరాలు హోర్డింగులలో వేసి ప్రకటనలతో పాటు.. హోర్డింగులతో నగరమంతా గులాబీ మయం చేసేసింది. అయితే అన్నీ తమ ఖాతాలో వేసుకున్న అధికార పార్టీ మాత్రం మెట్రో రైలును మాత్రం తమ ఖాతాలో వేసుకోలేదు.. సరికదా దీనికి సంబంధించిన ఒక్క యాడ్ ను తమ హోర్డింగుల్లో ఎక్కడా వేసుకోలేదు. ఎందుకంటే.. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మెట్రో రైలు విషయంపై టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి అభ్యంతరాలు చెప్పకపోయినా..రాష్ట్ర విభజన తరువాత మాత్రం అలైన్ మైంట్ మార్పు విషయంలో కొన్ని అభ్యంతరాలు చెప్పింది. అంతేకాదు కేసీఆర్ కూడా అలైన్ మైంట్లో మార్పు పక్కా అని చెప్పారు. కానీ పాత అలైన్ మెంట్ ను కొనసాగించాలని నిర్ణయించటంపై సుల్తాన్ బజార్ వ్యాపారులు.. పాతబస్తీకి చెందిన వారు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. దీంతో అధికార పార్టీ లేనిపోని తలనొప్పులు ఎందుకని మెట్రో రైలును తమ ఖాతాలో వేసుకోకుండా జాగ్రత్త పడుతోంది.