అపాయింటెడ్ డేపై కేంద్రానికి చెప్పుకోండి: హైకోర్టు

 

ఎన్నికల ప్రక్రియ ముగియడానికి, అపాయింటెడ్ డేకి మధ్య 17 రోజుల వ్యవధి వుండటం టీఆర్ఎస్‌కి చెమటలు పట్టిస్తోంది. ఈ పదహేడు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ట్రిక్కులు ప్రయోగించి టీఆర్ఎస్‌లో చీలిక తెచ్చే ప్రమాదం వుందని భయపడుతోంది. తద్వారా తెలంగాణలో మొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ చేతుల్లోకి వెళ్ళే అవకాశం వుందని భావిస్తోంది. అందుకోసమే అపాయింటెడ్ డేని జూన్ 2 నుంచి మే 16వ తేదీకి మార్చాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఈ పిటిషన్‌ను మంగళవారం నాడు పరిశీలించింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ హైకోర్టు ముందు తన ఆవేదన వ్యక్తం చేసింది. జూన్ 2వ తేదీన అపాయింటెడ్ డే వుంటే రాజ్యాంగ సంక్షోభం వచ్చే అవకాశం వుందని వాపోయింది. అయితే హైకోర్టు మాత్రంఈ అంశాన్ని కేంద్రం దృష్టికే తీసుకెళ్ళాలని, అభ్యంతరాలుంటే కేంద్రానికే చెప్పుకోవాలని పిటిషన్ వేసిన టీఆర్ఎస్‌కి సూచించింది. దాంతో ఇప్పుడీ అంశం కేంద్రం మీద ఆధారపడింది. కేంద్రంలో వున్న కాంగ్రెస్ ఆపాయింటెడ్ డేని పొరపాటుగా కూడా మార్చదని అందరికీ తెలిసిన విషయమే.