తెరాసకు దూరం జరుగుతున్న బీజేపీ

 

తెలంగాణా జేయేసీలోభాగస్వామిగా కొనసాగుతున్న భారతీయ జనతా పార్టీ, ఇంతవరకు తెరాసతో అయిష్టంగానే కాపురం చేస్తున్నపటికీ, జాతీయపార్టీ అయిన తన మీద కూడా కేసీఆర్ కర్ర పెత్తనం చేయడం సహించలేకపోతోంది. కానీ, ఉద్యమాలలో పాల్గొనడం ద్వారా తెలంగాణాలో తన ప్రాభల్యం పెంచుకొనే ఆలోచనతో తెరాసను, దాని అధినేత కేసీఆర్ ను భరించక తప్పట్లేదు.

 

పేరుకి అది తెలంగాణా జేయేసీ అయినా, అది కేవలం తెరాస చెట్టుకు మొలిచిన మరో కొమ్మగానే కేసీఆర్ భావిస్తునందున, భాగస్వామ్య పార్టీలను ఆయన ఎన్నడూ ఖాతరు చేయలేదు. ఇంతవరకు ఆయన కర్ర పెత్తనం సహించిన భారతీయ జనతా పార్టీ, ఆయన ఏకపక్షంగా తమ పార్టీకే చెందిన మహమూద్ ఆలీని యం.యల్సీ.అభ్యర్దిగా ప్రకటించడంతో తీవ్ర ఆగ్రహంతో ఆయనకు ఎదురు తిరిగింది.

 

అసలు కేసీఆర్ కు తెలంగాణా సాదించాలనే కోరిక, తాపత్రయం ఉన్నట్లు లేదని, అందువల్లే ఆలీని తమ పార్టీ అభ్యర్దిగా ప్రకటించి, తెలంగాణాను వ్యతిరేకిస్తున్న మజ్లిస్ పార్టీ మద్దతు కోరుతున్నాడని బీజేపీ విమర్శించింది. తెలంగాణా సాధనకు అవసరమయితే తమ పార్టీ అద్వర్యంలోనడిచే యన్.డీ.యే. కూటమిలో చేరుతామని ప్రకటిస్తున్న కేసీఆర్, మరో వైపు తెలంగాణాను వ్యతిరేకించే మజ్లిస్ పార్టీతో కలిసి ఏవిదంగా పని చేస్తారని బీజేపీ ప్రశ్నిస్తోంది. రాష్ట్రంలో ఒక మాట, కేంద్రంలో మరొకమాట మాట్లాడుతూ కేసీఆర్ తమతో ‘డబల్ గేం’ ఆడుతున్నాడని బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. కేసీఆర్ తమను సంప్రదించకుండానే అభ్యర్ధిని ప్రకటించి, మళ్ళీ అతనిని గెలిపించుకోవడానికి తిరిగి తమ మద్దతే కోరడాన్నిబీజేపీ తప్పు పట్టింది.

 

కేసీఆర్ అవకాశవాద, ద్వంద వైఖరిని, అతని కర్ర పెత్తనాన్ని తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నభారతీయ జనతా పార్టీ, అతని వంటి రాజకీయ నాయకుడితో స్నేహం, ఎన్నికల పొత్తులు తమ పార్టీకి మేలు చేయకపోగా మరింత నష్టం తెచ్చే అవకాశం ఉందని భావిస్తోంది.

 

ఇక, కేసీఆర్ కూడా రాబోయే ఎన్నికలలోబీజేపీతో ఎన్నికల పొత్తులు గురించి ఎక్కడా ప్రస్తావించకుండా జాగ్రత్త పడుతూ, మొత్తం అన్నిస్థానాలకు తమ పార్టీ అభ్యర్డులనే ఖరారుచేసే ఆలోచనలో ఉన్నందున, త్వరలోనే బీజేపీకూడా తన దారి తానూ చూసుకోక మానదు. ఉద్యమాల వల్ల తెలంగాణాలో కొంచెం బలం పుంజుకొన్నభారతీయ జనతా పార్టీ బహుశః రాబోయే ఎన్నికలలో ఒంటరిపోరుకే సిద్దపడవచ్చును.