వెళ్ళిపోయీ నవ్విస్తున్న ఎమ్మెస్ నారాయణ

 

ప్రముఖ హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణ శుక్రవారం నాడు అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని తన స్వస్థలం నిడమర్రుకు వెళ్ళిన ఎమ్మెస్ నారాయణ అక్కడ ఫుడ్ పాయిజనింగ్ కారణంగా అనారోగ్యానికి గురయ్యారు. ఆయన్ని వెంటనే విజయవాడలోని ఆస్పత్రికి, ఆ తర్వాత హైదరాబాద్‌లోని కిమ్స్‌కి తరలించారు. గురువారం నాడు ఆయన మరణించారని పుకార్లు వచ్చాయి. అయితే ఆయన మరణించలేదని ఆ తర్వాత తెలిసింది. నలుగురినీ నవ్వించే ఎమ్మెస్ నారాయణ సజీవంగా వున్నారన్న వార్త అందరికీ సంతోషాన్ని కలిగించింది. అయితే ఆ సంతోషం ఒక్క రోజు కూడా నిలబడలేదు. శుక్రవారం నాడు ఆయన మరణించారు. ఈ వార్త విన్న తెలుగువారు ఎంతో బాధపడుతున్నారు. దాదాపు ఏడు వందల సినిమాల్లో నటించిన ఆయన తన వైవిధ్యమైన హాస్యంతో ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఎమ్మెస్ నారాయణ పూర్తి పేరు మైలవరపు సూర్యనారాయణ. 1951వ సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రులో జన్మించారు. బాగా చదువుకున్న ఆయన భీమవరంలోని ఓ కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పనిచేశారు. ఆ తర్వాత సినిమా రచయిత అవ్వాలన్న ఉద్దేశంతో హైదరాబాద్‌కి చేరుకుని తీవ్రంగా ప్రయత్నించారు. అయితే రచయితగా ఆయన కొద్ది సినిమాలకు మాత్రమే పనిచేశారు. ఆ తర్వాత ఆయన హాస్య నటుడిగా ప్రస్థానం ప్రారంభించారు. వంశీ దర్శకత్వం వహించిన ‘లింగబాబు లవ్ స్టోరీ’ నటుడిగా ఆయన తొలి చిత్రం. ఆ తర్వాత ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన ‘మా నాన్నకి పెళ్ళి’ సినిమాలో తాగుబోతు పాత్రను ధరించడంతో ఆయన కెరీర్ మంచి మలుపు తిరిగింది. ఆ తర్వాత ఆయన ఎప్పుడూ వెనుదిరిగి చూసుకోలేదు.. దాదాపు ఏడు వందల సినిమాల్లో నటించారు. తాగుబోతు పాత్రలను ధరించడంలో స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్నారు. పేరడీ పాత్రలను ధరించడంలో ఆయన తర్వాతే ఎవరైనా అన్నట్టుగా నటించారు. ఆయన్ని చూస్తేనే ప్రేక్షకులకు నవ్వు వచ్చేంతగా ఆయన నటుడిగా పరిణితిని సాధించారు. నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా ఆయన కృషి చేశారు. తన కుమారుడు విక్రమ్ హీరోగా ‘కొడుకు’, ‘భజంత్రీలు’ అనే రెండు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. హాస్య నటుడిగా ఎమ్మెస్ నారాయణ రామసక్కనోడు, మానాన్నకు పెళ్లి, సర్దుకుపోదాం రండీ, శివమణి, దూకుడు సినిమాల ద్వారా ఐదుసార్లు నంది అవార్డులు పొందారు. దూకుడు సినిమాలో ఆయన నటనకు ఫిలిం ఫేర్ అవార్డును కూడా అందుకున్నారు. నటుడిగా ప్రేక్షకులలో విశేషమైన ఆదరణ మాత్రమే కాకుండా... మంచి మనిషిగా, మృదుభాషిగా కూడా పేరు సంపాదించుకున్న ఆయన ఆకస్మికంగా మరణించడం దురదృష్టకరం. ఆయన చనిపోయిన శుక్రవారం నాడే ఆయన నటించిన ‘పటాస్’ సినిమా విడుదలైంది. ఆ సినిమాలో ఎమ్మెస్ నారాయణ ‘సునామీ స్టార్’ అనే పాత్రలో నటించి ప్రేక్షకులను ఓ వైపు నవ్విస్తూనే మరోవైపు కంటతడి పెట్టించారు. ఎమ్మెస్ నారాయణ భౌతికంగా మరణించినప్పటికీ ఆయన పంచిన హాస్యం తెలుగు ప్రజల పెదవుల మీద చిరస్థాయిగా మెరుస్తూనే వుంటుంది.