అజిత్ పవార్ దుర్మరణం.. మహా రాజకీయాల్లో పెను విషాదం!

posted on: Jan 28, 2026 9:37AM

విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం పాలైన ఘటన మహా  రాజకీయాల్లో పెను విషాదంగా రాజకీయవర్గాలు అభివర్ణిస్తున్నాయి. ఆయన మృతి పట్ల రాజకీయాలకు అతీతంగా పలువురు నేతలు తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు.  మంగళవారం (జనవరి 27) కేబినెట్ భేటీలో చురుకుగా పాల్గొన్న ఆయన బుధవారం (జనవరి 28) బారామతిలో ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి వెడుతూ, ఆయన ప్రయాణిస్తున్న విమానం క్రాష్ అవ్వడంతో దుర్మరణం పాలయ్యారు.

తన సొంత నియోజకవర్గమైన బారామతిలో ఆయన బుధవారం ఉదయం పది గంటల నుంచీ రాత్రి వరకూ మూడు ఎన్నికల సభలలో ప్రసంగించాల్సి ఉంది. ఇందుకోసం ఆయన తన ఛార్టెడ్ ఫ్లైట్ లో ముంబై నుంచి బారామతికి బయలు దేరారు. సరిగ్గా బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా విమానం క్రాష్ అయ్యింది. ఈ దుర్ఘటనలో ఆయన సహా ఐదుగురు మరణించారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. 
విమానం బయలుదేరిన తరువాత సాంకేతిక లోపాన్ని గుర్తించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నిస్తుండగా ఈ దుర్ఘటన జరిగిందంటున్నారు. విమానం కూలిపోగానే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విమానం రెండు ముక్కలైనట్లు చెబుతున్నారు.  

అజిత్ పవార్ మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్ సోదరుడి కుమారుడు. సొంత బాబాయ్ అయిన అజిత్ పవార్ అడుగుజాడల్లో రాజకీయ అడుగులు వేసిన అజిత్ పవార్ తొలిసారిగా 1991లో బారామతి నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆ తరువాత శరద్ పవార్ కోసం ఆ స్థానాన్ని వదులుకుని అదే ఏడాది బారామతి అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించి మహా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అదే నియోజకవర్గం నుంచి వరుసగా ఏడు సార్లు విజయం సాధించారు. ప్రస్తుతం మహారాష్ట్ర లో అధికారంలో ఉన్న మహాయతి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...