ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నది అందుకే...

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎందుకంటారనే విషయం మెల్లమెల్లగా జనానికి అర్థమవుతోంది. ఆ విషయం..ఈ విషయం అని కాకుండా అన్ని విషయాల్లోనూ మన పూర్వీకులు ఒక క్రమపద్ధతిలో నడిచారు కాబట్టే..వారు నిండు నూరేళ్లు హాయిగా బ్రతికారు. ఆధునికత ప్రభావమో లేక పాశ్చాత్య పోకడలో మనం సంప్రదాయాన్ని అనాగరికతగా భావిస్తూ జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నాం. అయితే ఇప్పుడిప్పుడే ఆధునిక జీవనశైలి మనల్ని ఎంత చిత్తు చేస్తుందో తెలుస్తోంది. డెబ్బయిల తర్వాత మన జీవన శైలిలో వచ్చిన వేగవంతమైన మార్పులతో వ్యాధుల్లోనూ అంతే మార్పులు వచ్చాయి.

 

మనం తిసుకునే ఆహారంలో పాశ్చాత్య పోకడలు పెరిగిపోయాయి. ఇందులో పోషకాల కంటే రుచి కోసం కొవ్వు, క్యాలరీలే ఎక్కువ. ఇక ఉరుకులు పరుగుల జీవితంలో అన్ని సమకూర్చుకోవడం కోసం భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తున్నారు. మనసు విప్పి మాట్లాడుకోవడానికి, కంటి నిండా నిద్రపోవడానికి, ఒక్క క్షణం ఆలోచించడానికి, ఆఖరికి మనం పరిగెత్తడానికి అవసరమైన తిండి ప్రశాంతంగా తినడానికి కూడా టైమ్ లేదు. అంతా ఇన్‌స్టెంట్‌గా, రెడీమేడ్‌గా అప్పటికప్పుడు జరిగిపోవాలి. దీంతో మంచి పోషకాహారాలను ఇంట్లోనే తయారు చేసుకునే సమయం లేక టైంకి ఏదో ఒకటి కడుపులో పడేలా చూసుకుంటున్నారు. అంతే తప్ప..ఆరోగ్యకరమైన ఆహారానికి నోచుకోవడం లేదు.

 

ఇలాంటి వారందరిని మేల్కోలిపే అధ్యయనం ఒకటి తాజాగా బయటపడింది. పోటీ ప్రపంచంలో మనిషి వేగంగా అభివృద్ధి చెందాలన్న ఆశతో ఎన్నో రకాల పనులను చేస్తున్నాడు. ఈ క్రమంలో శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ప్రధానంగా జ్ఞాపకశక్తిని కోల్పోతున్నాడు. మానవాళిని ఇప్పుడు వేధిస్తున్న సమస్యల్లో మెమోరీ లాస్ ఒకటి..దీనినే అల్జిమర్స్ అని కూడా పిలుస్తున్నారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ వ్యాధి కోరలు చాస్తోంది. అన్ని దేశాల్లో లాగే దీని ముప్పు భారతదేశానికి తప్పలేదు. మన దేశంలో ఒక మిలియన్ మంది ప్రజలు అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నారని అంచనా.

 

అయితే అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిషన్ సంస్థ జరిపిన అధ్యయనం ప్రకారం భారతదేశపు సంప్రదాయ ఆహార అలవాట్లను పాటించే వారిలో అల్జీమర్స్ క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్టు గుర్తించారు. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే..మాంస పదార్థాలు తక్కువగా ఉండే భారత్, జపాన్, నైజీరియా వంటి దేశాల సంప్రదాయ ఆహారపదార్థాల నుంచి ఈ తరహా ప్రయోజనాలు అధికంగా ఉంటున్నట్టు తేలింది. అల్జీమర్స్‌ వ్యాధి శారీరకంగా వచ్చేదే అయినా..ఆహారంతో సంబంధమున్నట్లు పరిశోధనలో తేలింది. ముఖ్యంగా మాంసం, తీపిపదార్థాలు, కొవ్వు ఎక్కువగా ఉండే పాల ఉత్పత్తులు, వ్యాధుల ముప్పును పెంచడంలో కీలకపాత్ర పోషిస్తున్నట్టు తేల్చారు. ఇలాంటి ఆహార వినియోగాన్ని తగ్గించడం ద్వారా అల్జీమర్స్‌ వ్యాధితో పాటు పలురకాల క్యాన్సర్లు, టైప్-2 మధుమేహం, పక్షవాతం, మూత్రపిండాల వ్యాధుల ముప్పు కూడా గణనీయంగా తగ్గినట్టు అధ్యయనంలో తేలింది. సో ఇప్పటికైనా బద్దకాన్ని వదిలి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న సూక్తిని అన్ని విషయాల్లో అన్వయించుకోండి.