ఐస్‌క్రీంని బట్టి మనస్తత్వం

 

మీకు ఏ ఐస్‌క్రీం అంటే ఇష్టం? అని అడిగితే ఠక్కున వెనీలా అనో స్ట్రాబెర్రీ అనో జవాబు చెప్పేస్తాం. కానీ సరదాగా ఇష్టపడిన ఆ రుచి వెనక మన మనస్తత్వం దాగి ఉందంటే నమ్మగలరా! కొన్ని రుచులను మనం ప్రత్యేకంగా ఇష్టపడటానికి కారణం మన మెదడులో ఉండే limbic lobe అనే భాగమే కారణం. ఇదే భాగం మన మనస్తత్వాన్ని కూడా నిర్దేశిస్తుందని చెబుతారు. కాబట్టి మనం ఎలాంటి పదార్థాలను ఇష్టపడతామో అన్న విషయం ద్వారా మన వనస్తత్వం ఎలాంటిదో కూడా పసిగట్టేయవచ్చునట! కావాలంటే మీరే పోల్చి చూసుకోండి…


వెనీలా

వెనీలా అతి సాధారణమైన ఫ్లేవర్‌. మీరు కూడా అంతే నిరాడంబరంగా ఉంటారు. జీవితంలో ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తారు. ప్రేమకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కష్టకాలంలో నమ్మదగిన మనిషిగా గుర్తింపు పొందుతారు. ఎంత నిదానంగా కనిపించినా... అవసరం అయినప్పుడు మీ మనసులో మాటని నిర్మోహమాటంగా చెప్పేయగలరు. ఆపదని ఎదుర్కొనేందుకు ఎంతటి సాహసానికైనా సిద్ధపడగలరు.


చాక్లెట్‌

మనుషులని గెల్చుకోవడంలో మిమ్మల్ని మించినవారు ఉండదరు. పార్టీలన్నా, ప్రయాణాలన్నా మీకు మహా సరదా! ప్రపంచంలో ప్రతి ఒక్కరినీ ప్రేమించేందుకు మీరు సిద్ధంగా ఉంటారు. అదే సమయంలో మిమ్మల్ని మీరూ ప్రేమించుకుంటారు. జీవితాన్ని అనుభవిస్తూనే, కెరీర్‌లో దూసుకుపోతారు. మీ జీవితంలో అటు విలాసాలకీ, ఇటు వినోదాలకీ కొదవే ఉండదు.


స్ట్రాబెర్రీ

మీలో సహనం చాలా ఎక్కువ. ఒక బంధాన్ని నిలుపుకొనేందుకు, జీవితంలో నిరంతరం ముందుకు వెళ్లేందుకైనా ఆ సహనమే మీకు శ్రీరామరక్షగా నిలుస్తుంది. అంతర్ముఖులుగా (introvert) మీరు నిత్యం ఏదో ఒక ఆలోచనలో మునిగిపోయి ఉంటారు. ఒకోసారి ఆ ఆలోచనలే మీలో లేనిపోని భయాలను రేకెత్తిస్తాయి. ఆత్మన్యూనతో కుంగిపోయేలా చేస్తాయి.


పిస్తా

మీది నలుగురూ నడిచే బాట కాదు. నలుగురూ మాట్లాడే మాట కాదు. మీకంటూ ఒక భిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది. ఎవరి వైపూ మొగ్గు చూపని, ఎవరి ప్రభావానికీ లొంగని ప్రత్యేకత మీది. అదే భిన్నత్వం వల్ల స్నేహితులు మీరంటే ఇష్టపడతారు. ఆ భిన్నత్వం ఒకోసారి మిమ్మల్ని కొరకరాని కొయ్యగా మారుస్తుంది. ఇతరుల కంటే వైవిధ్యంగా ఉండాలనే తపన ఒకోసారి అసహనానికి దారితీస్తుంది.


బటర్‌ స్కాచ్‌

మీరు ఏదన్నా పని చేస్తే, వేలెత్తి చూపించేందుకు ఏమీ ఉండదు. మీ జీవితం కూడా అలాగే ఉండాలనుకుంటారు. సంప్రదాయాలను అనుసరిస్తూ గౌరవాన్ని పొందుతారు. మీ గమ్యాన్ని చేరుకునేందుకు ఒక ప్రణాళికను ఏర్పరుచుకుని, దాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు. ఎంత కష్టం వచ్చినా, ఎన్ని నష్టాలు ఎదురైనా... మీరు ఏర్పరుచుకున్న విలువలని అంగుళం కూడా సడలించరు.

ఇవే కాదండోయ్‌! బనానా, మింట్, ఆల్మండ్, కాఫీ- ఇలా రకరకాల ఐస్‌ క్రీం ఫ్లేవర్లు ఉన్నాయి కానీ... మనకి ఎక్కువగా దొరికే రుచుల గురించే పైన చెప్పుకొన్నాం. వాటిలో ఎంతవరకు నిజం ఉందో మీరే చెప్పాలి. 

- నిర్జర.