థాయ్‌లాండ్‌లో భారీ భూకంపం

 

థాయ్‌లాండ్‌లో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలు మీద భూకంప తీవ్రత 6.3గా నమోదైంది. ఉత్తర థాయ్‌లాండ్‌లోని చియాంగ్ రాయ్ నగరంలో ఈ భూకంప కేంద్రం వుంది. నగరంలో విమానాశ్రయం ఎక్కడ వుందో అక్కడే భూకంప కేంద్రం వుండటం విశేషం. భూకంపం సంభవించగానే విమానాశ్రయంలో వున్నవారిని వెంటనే అక్కడి నుంచి బయటకి పంపేశారు. ఎయిర్పోర్టులో భూకంపం వల్ల చాలా విధ్వంసం జరిగింది. రన్వేకు మాత్రం ఎటువంటి నష్టం వాటిల్లలేదు. విమాన సర్వీసులకు ఆటంకం కలగలేదు. అలాగే పాన్ జిల్లాలో భూకంప ప్రభావం తీవ్రంగా ఉంది. రోడ్లు నిలువునా చీలిపోయాయి. కిటికీలు బద్దలయ్యాయి. గోడలు కూలిపోయాయి. బౌద్ధారామాలు బాగా దెబ్బతిన్నాయి. ఇప్పటివరకు ఒకరు మృతి చెందారని, పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. భూకంపం బాధిత ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది.