TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణలో టెన్త్‌ ఫలితాలు విడుదల

Published on: Wed Apr 30, 2025 2:57PM

 

తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి.  ఇవాళ మధ్యాహ్నాం రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  టెన్త్‌ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం ఐదు లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 92.78 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రకటించారు. గురుకులాల్లో  98 శాతం, ఆశ్రమ పాఠశాలల్లో 95 శాతం, ప్రైవేట్‌ పాఠశాలల్లో 94.12 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా.. గతేడాది కంటే 1.47 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈసారి అనూహ్యంగా ప్రైవేటు స్కూళ్ల కంటే ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో అత్యధిక ఉత్తీర్ణ శాతం నమోదు కావడం విశేషం. 

బాలురు 91.32 శాతం, బాలికలు 94.26 శాతం ఉత్తీర్ణులయ్యారు. 4,629 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణతను సాధించాయి. 99.29 శాతంతో మహబూబ్‌నగర్ జిల్లా అగ్ర స్థానంలో నిలిచింది. 73.97 శాతంతో చివరి స్థానంలో వికారాబాద్ జిల్లా ఉంది. జూన్ 3 నుంచి 13 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. ఆ పరీక్ష ఫీజు చెల్లింపునకు మే 16 వరకు గడవు ఇచ్చారు. ఇక రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు గాను ఒక్కో సబ్జెక్ట్‌కు రూ.500 చెల్లించి దరఖాస్తు చేసుకునేందుకు మే 15 వరకు అవకాశం కల్పించారు.కాగా, పదో తరగతి పరీక్షలు మార్చి 21 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 4న ముగిశాయి. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.