TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చీకటి పడితే చాలు వణికిస్తున్న చలి... పులి

Published on: Mon Nov 10, 2025 4:06PM

 

మొన్నటి వరకు అయితే భానుడి భగభగలు.. లేదంటే వరణుడి ఉరుములతో  తెలుగు రాష్ట్రాల ప్రజలకు చుక్కలు కనిపించాయి. ఇప్పుడు నా వంతు అంటూ చలిగాలులు ఎంట్రీ ఇచ్చాయి. ఇప్పుడు ప్రజలను ఈ గాలులు వణికిస్తున్నాయి. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. జస్ట్ రెండు, మూడు రోజుల వ్యవధిలోనే ఉష్ణోగ్రతలు.. 10 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు పడిపోయాయి. అయితే ఇది కాదు.. అసలు కథ ముందుంది అంటోంది వాతావరణశాఖ. రాబోయే పది రోజుల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుందని అధికారులు తెలిపారు. 

వాతావరణశాఖ విడుదల చేసిన లేటెస్ట్‌ లెక్కల ప్రకారం… ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 5 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ రెండు జిల్లాల్లో రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు ఈ స్థాయికి పడిపోవడంతో ఉదయం కూడా దట్టమైన పొగమంచు ఆవరించి ఉంటోంది.  రాత్రి ఉష్ణోగ్రతలు రోజురోజుకి పడిపోతున్నాయి. మూడు నాలుగు రోజుల వ్యవధిలోనే కనిష్ఠ ఉష్ణోగ్రతలు 18-20 డిగ్రీల నుంచి 9-13 డిగ్రీల మధ్యకు చేరుకున్నాయి. అయితే, రాబోయే పది రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగబోతుంది. అవును.. నవంబరు 11-19 తేదీల వరకు అనగా రాబోయే పది రోజుల్లో రాష్ట్రంలో చలి తీవ్రత అధికంగా ఉండనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ముఖ్యంగా 13-17 తేదీల మధ్య మరింత అధికంగా ఉంటుందని, కొన్ని జిల్లాల్లో రాత్రి పూట ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌ అంటే పది డిగ్రీల లోపు పడిపోనున్నాయని పేర్కొంది. అల్లూరి సీతారామరాజు, చిత్తూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, విజయనగరం, వైఎస్సార్‌ కడప, ప్రకాశం, అనకాపల్లి, నంద్యాల, పార్వతీపురం మన్యం, పల్నాడు, తూర్పు గోదావరి, ఎన్టీఆర్‌ జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15 నుంచి 20 డిగ్రీల మధ్యలో నమోదవుతున్నాయి.
రాబోయే పది రోజుల్లో చాలా జిల్లాల్లో రాత్రి పూట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు అధికారులు. ముఖ్యంగా ఆసిఫాబాద్, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా 30 డిగ్రీల వరకే నమోదవుతాయన్నారు. 

చలి తీవ్రత పెరుగుతుండటంతో పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
ఉత్తర భారతదేశంలో ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ఇప్పటికే మంచు వర్షం ప్రారంభమైంది. యూపీ, ఢిల్లీ, బీహార్, పంజాబ్, మధ్యప్రదేశ్‌లలో కూడా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. రాజస్థాన్‌లో కూడా ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమవుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో కోల్డ్‌ వేవ్ పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు తెలిపారు. చాలా రాష్ట్రాల్లో తెల్లవారుజామున పొగమంచు కురుస్తోంది. 


దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికే కాలుష్యంతో సతమతమవుతున్న ప్రజలకు.. ఇప్పుడు చలి కూడా తోడైంది. రాత్రి, తెల్లవారుజామున దట్టమైన పొగమంచు వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. ఇక హిమాచల్, ఉత్తరాఖండ్‌లోని ఎత్తైన ప్రాంతాల్లో ఇప్పటికే మంచు కురవడం ప్రారంభమైంది. ఇది ఊహించిన దానికంటే చాలా ముందు సమయం అంటున్నారు అధికారులు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఈ సారి రికార్డ్‌ స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం కనిపిస్తోందని చెబుతున్నారు. 

మరోవైపు నవంబర్ 11 నుండి 19 వరకు (ప్రధానంగా 13 నుండి 17 నవంబర్ వరకు) 8-10 రోజుల పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతవరణ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలకు సమీపంలోని దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మోస్తరు చలి, ఉష్ణోగ్రతలు 14°C–17°C మధ్య ఉండవచ్చుని.. సాధారణంగా ఇంత దీర్ఘకాలం  చలి తీవ్రత తరచుగా ఉండదు, కానీ ఈ సంవత్సరం 8-10 రోజుల పాటు తీవ్రమైన చలి వాతావరణం ఉండ బోతోందని పేర్కొన్నారు