టోరి రేడియో భారత్-పాక్‌లను కలిపింది:తెలుగువన్ ఎండీ రవిశంకర్

టోరి రేడియో భారత్-పాకిస్థాన్‌ల మధ్య సరిహద్దులను చెరిపివేసిందన్నారు తెలుగువన్.కామ్ ఎండీ కంఠంనేని రవిశంకర్. తెలుగువన్.కామ్ 16వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. తెలుగువన్ ఆధ్వర్యంలో నడిచే టోరి రేడియో ద్వారా 44 దేశాల్లోని తెలుగువారిని ప్రతిరోజు పలకరిస్తున్నామన్నారు. ప్రపంచ ప్రఖ్యాత బీబీసీ రేడీయో కూడా 22 గంటలు మాత్రమే ప్రత్యక్ష ప్రసారాలు చేస్తే..తాము 24 గంటలు ప్రత్యక్ష ప్రసారాలు చేస్తున్నామన్నారు.

 

కేవలం వినోదం మాత్రమే కాకుండా సామాజిక కార్యక్రమాల్లో కూడా టోరి రేడియో ముందుంటుందన్నారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ..పేదరికంతో వైద్యం చేయించుకోలేకపోయిన ఎంతోమందికి టోరి రేడియో అండగా నిలబడిందన్నారు. బాధితుల సమస్యను శ్రోతల దృష్ఠికి తీసుకువెళ్లి దాతల సాయంతో టోరి రేడియో వారికి ఎన్నోసార్లు వైద్యం చేయించిందన్నారు. అలా ఒక సంఘటనను రవిశంకర్ గుర్తు చేసుకున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక బాలుడి దీనగాథను టోరి రేడియోలో ప్రసారం చేశామని ఈ సందర్భంగా టోరి రేడియో శ్రోతలు తమకు తెలిసిన వారి నుంచి విరాళాలు సేకరించారు. పాకిస్థాన్‌లో కూడా విరాళాలు సేకరిస్తుండగా అక్కడి స్థానికులు విషయం తెలుసుకుని వారు కూడా బాబు వైద్య ఖర్చుల నిమిత్తం విరాళం ఇచ్చారన్నారు. భారత్ అంటే ఏ మాత్రం పడని పాకిస్థానీయుల్ని కదిలించిన ఘనత టోరి రేడియోదేనని రవిశంకర్ అన్నారు.