మానవత్వ పరిమళం డాక్టర్ శివారెడ్డి

కృష్ణాజిల్లా ఘంటసాల మండలం దాలిపర్రు గ్రామానికి చెందిన దాసరి శివ శ్రమజీవి. కొద్ది రోజుల క్రితం ఆయన కరెంట్ పోల్ ఎక్కి టీవీ కేబుల్ లాగుతూ వుండగా హెటెన్షన్ వైర్లు తగిలి ఆయన తీవ్రంగా కాలిన గాయాలకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయన కుడిచెయ్యి మొత్తం కాలిపోయింది. శరీరం కూడా 36 శాతం కాలిన గాయాలకు గురైంది. ఈ బాధ చాలదన్నట్టుగా తీవ్రమైన వేడి కారణంగా శివ ఊపిరితిత్తులు కూడా పాడైన విషయం బయటపడింది. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కి చేరుకున్న దాసరి శివకి ‘తెలుగువన్ ఫౌండేషన్’ అండగా నిలిచింది. ఆయనకి బతుకు మీద ఆశ కల్పించింది. హైదరాబాద్‌లోని మెడిసిటీ ఆస్పత్రిలో ఆయనకు అవసరమైన వైద్య సేవలు అందేలా సహకరించింది.

 

దేవుడు ఉన్నాడో లేడో.. ఉంటే ఎక్కడ ఉంటాడో ఎవరికీ తెలియదు. అయితే నలుగురికీ ఉపయోగపడేవాడే మనకు కనిపించే నిజమైన దేవుడు. ఆ దేవుడు నేటి సమాజంలో వైద్యుడి రూపంలో కూడా అక్కడక్కడా కనిపిస్తూ వుంటాడు. హైదరాబాద్ మెడిసిటీ ఆస్పత్రిలోని న్యూరో సర్జన్ డాక్టర్ శివారెడ్డి అలాంటి వైద్యుడే. దాసరి శివ మెడిసిటీ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి డాక్టర్ శివారెడ్డి ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. దాదాపు ఎనిమిది మంది నిపుణులైన డాక్టర్ల సహకారంతో శివ ఆరోగ్య పరిస్థితిని అంచనా వేశారు. శివకు ఎలాంటి చికిత్స అందిస్తే త్వరగా కోలుకుంటారన్న విషయాన్ని అర్థం చేసుకున్నారు. అందుకు తగిన చికిత్స చేశారు. డాక్టర్ శివారెడ్డి ఇచ్చిన అద్భుతమైన ట్రీట్‌మెంట్‌తో దాసరి శివ పూర్తిగా కోలుకున్నాడు. కొడిగడుతుందేమోనని అందరూ భయపడిన అతని ప్రాణ దీపం మళ్ళీ ఉజ్వలంగా ప్రకాశించడం ప్రారంభించింది. డాక్టర్ శివారెడ్డి ఎలాంటి ప్రతిఫలాన్ని తీసుకోకుండా శివకు నాణ్యమైన చికిత్సని అందించి ఒక జీవితాన్ని నిలబెట్టారు. మానవత్వం మీద మనకున్న నమ్మకాన్ని మరింత పెంచారు.