మరో కొత్త వివాదం: హైదరాబాద్ లో ఆంద్ర ప్రదేశ్ అధికారి అరెస్ట్

 

ఇప్పటికే వివిధ అంశాలతో కత్తులు దూసుకొంటున్న ఆంద్ర, తెలంగాణా ప్రభుత్వాలకి తమ యుద్ధం కొనసాగించడానికి మరొక బలమయిన కారణం దొరికింది. తెలంగాణ పోలీసులు హైదరాబాద్ ఆర్.టీ.సి క్రాస్ రోడ్స్ వద్దగల ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖకు చెందిన కార్యాలయంలో ప్రవేశించి రాష్ట్రానికి చెందిన అధికారి పీవీ మురళీ సాగర్ అనే అధికారి బీరువాను పగులగొట్టి అందులో ఫైళ్ళను స్వాధీనం చేసుకొన్నారు. ఆ తరువాత ఆయన ఇంట్లో కూడా శోధించారు.

 

మురళీసాగర్ తెలంగాణా రాష్ట్రానికి చెందిన రూ.609కోట్ల సొమ్మును అక్రమంగా విజయవాడ ఆంద్ర ప్రదేశ్ కార్మికశాఖ యొక్క బ్యాంకు ఖాతాల్లోకి మళ్ళించారంటూ తెలంగాణా కార్మికశాఖ కమీషనర్ ఎ.అశోక్ చిక్కడపల్లి పోలీసు స్టేషనులో నిన్న ఉదయం పిర్యాదు చేయడంతో, పోలీసులు మురళీసాగర్ పై ‘చీటింగ్ మరియు నమ్మకద్రోహం’ కేసులు నమోదు చేసి ఆయన లేనప్పుడు ఆయన ఇంట్లో, కార్యాలయంలో తనికీలు నిర్వహించి, ఆయన ఆంద్రప్రదేశ్ చీఫ్ సెక్రెటరీతో సమావేశం ముగించుకొని సాయంత్రం సచివాలయానికి తిరిగి వచ్చినప్పుడు అరెస్ట్ చేసారు.

 

అవిబాజ్య ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కార్మికశాఖ రాష్ట్రంలో గల మునిసిపాలిటీల నుండి కార్మిక సంక్షేమం కోసం 1శాతం సెస్ గా వసూలు చేసేది. ఆ మొత్తం రూ.1400కోట్లు ఉందని తెలంగాణా కమీషనర్ వాదన. విభజన చట్టం ప్రకారం ఆ మొత్తాన్ని రెండు రాష్ట్రాలు 58:42 నిష్పత్తిలో పంచుకొంటే తెలంగాణ వాటాగా రూ.609కోట్లు వస్తుంది. కానీ మురళీసాగర్ తెలంగాణా ప్రభుత్వానికి తెలియజేయకుండా ఆ మొత్తాన్ని విజయవాడకు తరలించారని పిర్యాదు చేసారు.

 

కానీ మురళీసాగర్ మీడియాతో మాట్లాడుతూ, తమ శాఖ వసూలు చేసిన మొత్తం రూ. 910 కోట్లు మాత్రమేనని, అందులో తెలంగాణకు రూ.410కోట్లు మాత్రమే వాటాగా వస్తుందని తెలిపారు. ఇంతవరకు ఆ మొత్తాన్ని ఫిక్సడ్ డిపాజిస్ట్ రూపంలో హైదరాబాద్ లోగల వివిధ బ్యాంకులలో ఉంచామని, దానిని రెండు రాష్ట్రాలు పంచుకోవాలంటే అందుకోసం రెండు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులతో ఒక కమిటీని వేసి మార్గదర్శకాలు ఏర్పాటు చేసుకోవలసి ఉంటుందని, కానీ ఇంతవరకు కమిటీని ఏర్పాటు చేసుకోకపోవడంతో త్వరలో తమ కార్మికశాఖ కార్యాలయం విజయవాడకు తరలిపోతున్నందున ఆ మొత్తాన్ని విజయవాడలోని వివిధ బ్యాంకులలోకి బదిలీ చేసామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకే తాను ఈ మొత్తాన్ని విజయవాడకు బదిలీ చేసానని మురళీసాగర్ తెలిపారు.

 

తెలంగాణా పోలీసులు తమకు చెప్పకుండా, అనుమతి తీసుకోకుండా తమ ప్రభుత్వ కార్యాలయంలో జొరబడి, ఫైళ్ళను స్వాధీనం చేసుకోవడం, ఆంద్ర అధికారి ఇంట్లో తనికీలు నిర్వహించి ఆయనను అరెస్ట్ చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ వ్యవహారంపై తక్షణమే దర్యాప్తు చేసి ఒక నివేదిక సమర్పించాలని రాష్ట్ర డీ.జీ.పీ. రాముడుని ఆయన ఆదేశించారు.