Teluguone Exclusive తెలంగాణ తూచ్...!
posted on Feb 7, 2014 3:39PM

ఢిల్లీలో విభజన రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. ఢిల్లీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలలో స్పష్టత కంటే గందరగోళ పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెలంగాణ బిల్లుపై నెలకొన్న సస్పెన్స్...అదిరిపోయే ట్విస్టులతో టీ-20 మ్యాచ్ లాగా ఢిల్లీలో ఆఖరి పోరాటం సాగుతోంది. తాజాగా కేంద్రమంత్రుల వర్గం నుంచి తెలుగువన్ కి అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం..తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అసాధ్యమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకు అసాధ్యమో కూడా వివరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఇంకా కొన్ని దశల్ని దాటాల్సివుంది. కానీ ఈ దశలన్నిటినీ దాటేంత సమయం కేంద్రంలో వున్న యు.పి.ఎ. ప్రభుత్వానికి లేదని అభిప్రాయపడుతున్నారు.
యుపీఏ-2కు ఇవే చివరి సమావేశాలు. కాబట్టి సభ జరిగే ప్రతిరోజు కేంద్రానికి చాలా ముఖ్యమైనవి. తెలంగాణ బిల్లు నుంచి మతహింసనిరోధక బిల్లు వరకూ చాలా ముఖ్యమైన బిల్లును ఈ సమావేశాల్లో ఆమోదింప చేసుకోవాలని కాంగ్రెస్ పట్టుదలతో వుంది. కాని వరుసగా లోకసభ లో వాయిదాల పర్వం కొనసాగుతుండడంతో, విభజన బిల్లుని త్వరగా సభ ముందుకు తేవాలని అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.
గురువారం లోక్ సభలో విభజనకు సంబంధించి ప్రధాని మన్మోహన్ ప్రకటన చేయాల్సి వుంది. తెలంగాణ ఏర్పాటుతో సీమంధ్రకు ఎలాంటి అన్యాయం జరగదని, సీమాంధ్ర ప్రాంతాన్ని అన్ని విధాల ఆదుకుంటామని స్వయంగా మన్మోహన్ చేత ప్రకటన చేయించాలని భావించిన కాంగ్రెస్ అధిష్టానానికి సీమాంధ్ర నేతలు షాకిచ్చారు. సభను పది నిమిషాలు కూడా సజావుగా జరగకుండా అడ్డుకున్నారు. ఇకపై కూడా ఇలాగే సభను అడ్డుకొనేందుకు కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ఈ పరిణామాలు అధిష్టానానికి మింగుడుపడకపోయినా, ఏం చేయాలోనన్న దానిపై కూడా స్పష్టత లేదని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.
బిజెపి పార్టీ కాంగ్రెస్ తెచ్చిన బిల్లుల విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవంటూనే...కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు ఉభయసభల్లో గొడవ చేస్తూ సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతుంటే తెలంగాణ బిల్లు ఎలా పాస్ అవుతుందని సుష్మాస్వరాజ్ ప్రశ్నించినట్లు తెలిసింది. లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్, రాజ్యసభ అధ్యక్షుడు హమీద్ అన్సారీ సభ్యుల గొడవ, గందరగోళం మధ్య తెలంగాణ బిల్లును ఆమోదించేందుకు అనుమతి ఇవ్వకపోవచ్చుననే అనుమానాన్ని సుష్మాస్వరాజ్ వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఉభయ సభల్లో గొడవ చేస్తున్న కాంగ్రెస్ ఎంపీలను సభల నుండి సస్పెండ్ చేసేందుకు కూడా వారు అంగీకరించకపోవచ్చునని ఆమె చెప్పినట్లు తెలిసింది.
ఫిబ్రవరి 21పార్లమెంట్ సమావేశాలకు ఆఖరిరోజు. కాని ఇప్పటిదాకా విభజన బిల్లు పార్లమెంట్ మొఖం కూడా చూడలేదు. ఫిబ్రవరి10న టి-బిల్లు రాజ్యసభ ముందుకు రాబోతున్నది అని షిండే ప్రకటించారు. అయితే అసలు ఇంతవరకు బిల్లు క్యాబినెట్ ముందుకు రాలేదు. గురువారం క్యాబినెట్ ముందుకి బిల్లు వస్తుందని అంతా భావించిన అది శుక్రవారానికి వాయిదా పడింది. ఈ రోజు బిల్లుకి క్యాబినెట్ ఆమోదం లభిస్తే అక్కడ నుంచి రాష్ట్రపతి వద్దకు వెళుతుంది. రాష్ట్రపతి న్యాయసలహా కోరాలని భావిస్తే బిల్లు ఆమోదం పొందడం కష్టం. అలాగాకాకుండా తన వద్దే వుంచుకొని రెండు, మూడు రోజులు పరిశీలించిన కేంద్రానికి ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఫిబ్రవరి 12న మధ్యంతర రైల్వే బడ్జెట్,
ఫిబ్రవరి 17న ఓటాన్ అకౌంట్ బడ్జెట్,
ఫిబ్రవరి 15 శనివారం సెలవు,
ఫిబ్రవరి 16 ఆదివారం సెలవు,
మిగిలింది రెండే రోజులు అవి ఫిబ్రవరి 13, ఫిబ్రవరి 14...
ఫిబ్రవరి 12న మధ్యంతర రైల్వే బడ్జెట్, ఫిబ్రవరి 17న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కాబట్టి వాటిపై రెండు, మూడు రోజులు చర్చకు సమయం కేటాయించక తప్పదు. అప్పటికి పార్లమెంట్ సమావేశాలు ముగింపు దశకు చేరుకుంటాయి. కేంద్ర క్యాబినెట్, రాష్ట్రపతి, రాజ్యసభ ఇలా విభజన బిల్లు అన్నీ ప్రక్రియలను దాటుకొని ఫిబ్రవరి 12నాటికి బిల్లు లోకసభ కు రావాలి. కాని ఫిబ్రవరి 12న రైల్వే బడ్జెట్ వుంది కానుక ఆ రోజు విభజన బిల్లు ప్రవేశపెట్టరు. ఫిబ్రవరి 15, ఫిబ్రవరి 16 శని, ఆదివారాలు పార్లమెంట్ కి సెలవు దినాలు, ఫిబ్రవరి 17 నుంచి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వుంటుంది కాబట్టి మిగిలింది రెండే రోజులు అవి ఫిబ్రవరి 13, ఫిబ్రవరి 14...ఆ రెండు రోజుల్లో బిల్లు లోక్ సభలో పెట్టి అమోదించుకోవాలి. కాని ఆ వేగాన్ని అందుకోవడం కష్టమని కాంగ్రెస్ పార్టీ టాస్క్ మాస్టర్లు అధిష్టానానికి తేల్చిచెప్పడంతో..ఆ పార్టీ దిక్కు తోచనిస్థితిలో పడిపోయిందట.
కాబట్టి చివరాఖరికి చేపోచ్చేదే౦టంటే...ఇప్పుడప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యం కాదు...ఇది పేరు చెప్పడం ఇష్టంలేని కొంతమంది కేంద్రమంత్రుల నుంచి మాకందిన బోగట్టా!