తెలంగాణా అభివృద్ధికి భవిష్య ప్రణాళికలు ప్రకటించిన కేసీఆర్

 

వరంగల్ ఉప ఎన్నికలలో ఘన విజయం సాధించిన తరువాత తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ నేతలతో మాట్లాడుతూ, “ఈ విజయంతో మనకి మరింత బాధ్యత పెరిగింది. ఈ విజయంతో మనం ప్రజల పట్ల మరింత వినమ్రతతో మెలగాలి తప్ప గర్వం, అహం ప్రదర్శించరాదు. తెలంగాణా ప్రజలకు తెరాస కార్యకర్తలు ఒక రక్షణ కవచంలా ఉండాలి. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పును చూసిన తరువాత అయినా ప్రతిపక్షాలు ప్రభుత్వం పట్ల ప్రదర్శిస్తున్న అసహనాన్ని తగ్గించుకొని, ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వాలి, అని అన్నారు. ఆ తరువాత పార్టీ కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేసారు.

 

తమ ప్రభుత్వం త్వరలో ఎదుర్కోవలసిన మూడు ప్రధాన సవాళ్ళను ఆయన వారికి వివరించారు. 1. నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నికలు 2. జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు. 3 రాష్

 

ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం. అలాగే అయన తన భవిష్య ప్రణాళికలను కూడా వారికి వివరించారు. త్వరలో తను రాష్ట్రంలో బస్సు యాత్ర చేపట్టి, కనీసం వారం రోజుల పాటు అన్ని జిల్లాలలో పర్యటించి మారుమూల గ్రామాలలో ఉన్న పార్టీ నేతలను, కార్యకర్తలను కలుస్తానని తెలిపారు. ఆ సందర్భంగా ఆయా జిల్లాలలో నిర్మాణంలో ఉన్న వివిధ ప్రాజెక్టుల సమీపంలోనే తను బస చేసి వాటి పురోగతిని సమీక్షిస్తానని తెలిపారు. వచ్చే నాలుగేళ్ళలో అన్ని ప్రాజెక్టుల నుండి నీళ్ళు తరలించేందుకు అవసరమయిన వ్యవస్థలు ఏర్పాటు అయ్యేలా కృషి చేస్తానని తెలిపారు.

 

త్వరలోనే డి.ఎస్.స్సీ. పరీక్షలు నిర్వహించి ప్రభుత్వ కళాశాలలో 15,000-20,000 మంది టీచర్ల నియామకం పూర్తి చేస్తామని తెలిపారు. అదేవిధంగా డి.ఎస్.స్సీ-98 బ్యాచ్ లో అర్హులయిన 1,500 మందిని ఉద్యోగాలలోకి తీసుకొంటామని తెలిపారు. రెండు నెలల్లో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించి పర్మనెంట్ చేస్తామని తెలిపారు.

 

ఎన్నికల హామీల అమలులో భాగంగా ఈ ఏడాదిలో 60,000 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను, వచ్చే ఏడాది చివరికి లక్ష ఇళ్ళను నిర్మిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కొత్త ప్రతిపాదన చేసారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులలో ఏడాదికి రూ.6 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారందరికీ ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను కేటాయించాలనుకొంటున్నట్లు తెలిపారు. అందుకోసం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడుతో మాట్లాడి కేంద్రప్రభుత్వం తరపున మరిన్ని ఇళ్ళు తెలంగాణా రాష్ట్రానికి కేటాయించవలసిందిగా కోరుతానని తెలిపారు. తద్వారా ఒక్కో ఇంటికి కేంద్రం తరపున 2 లక్షల సబ్సీడీ లభిస్తుందని అన్నారు.

 

ప్రభుత్వం చేపడుతున్న అనేక చర్యల కారణంగా 2018 నాటికి తెలంగాణా రాష్ట్రం మిగిలు విద్యుత్ రాష్ట్రంగా అవతరిస్తుందని తెలిపారు. వచ్చే ఏడాది నుండి ఖరీఫ్ సాగుకు పగలు 9గంటల పాటు విద్యుత్ అందిస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికలలోగా ప్రతీ ఇంటికి త్రాగు నీరు అందించలేకపోయినట్లయితే తాము ప్రజలను ఓట్లు అడగబోమని మళ్ళీ మరో మారు ప్రకటించారు.

 

కళ్యాణ లక్ష్మి పధకం క్రింద ఎస్సీ, ఎస్టీ ఆడపిల్లల పెళ్లిళ్లకు ప్రభుత్వం ఇస్తున్న రూ. 51,000 ఆర్దికసహాయాన్ని వచ్చే మార్చి నుండి రాష్ట్రంలో నిరుపేదలందరికీ అందించబోతున్నట్లు ప్రకటించారు. మంత్రులు తమ తమ నియోజక వర్గాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం చెల్లింపులు చేసేందుకు వచ్చే ఏడాది బడ్జెట్ లో స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ క్రింద ఒక్కో మంత్రికి రూ.25 కోట్లు కేటాయిస్తామని తెలిపారు.