హైదరాబాద్ పోలీసుల ఆపరేషన్ ఆక్టోపస్!
posted on: Feb 24, 2026 12:27PM
.webp)
దేశవ్యాప్తంగా విస్తరించిన సైబర్ గ్యాంగ్‌లపై హైదరాబాద్ నగర పోలీసులు భారీ స్థాయిలో అణిచివేత చర్యలు చేపట్టారు. ఆపరేషన్ ఆక్టోపస్ పేరుతో నిర్వహించిన ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో 16 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు చేసి 104 మందిని అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 36 లక్షల నగదు, 200కి పైగా మొబైల్ ఫోన్లు, వందల సంఖ్యలో సిమ్ కార్డులు, బ్యాంకు పాస్ బుక్‌లు, డెబిట్–క్రెడిట్ కార్డులు, ల్యాప్‌టాప్‌లు, సంస్థల స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు.
డీసీపీ సైబర్ క్రైమ్స్ వి. అరవింద్ బాబు నాయకత్వంలో స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ ఎస్.ఎం. విజయ్ కుమార్ పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ జరిగింది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న పెట్టుబడి, ట్రేడింగ్, డిజిటల్ అరెస్ట్ వంటి మోసాల నేపథ్యంలో బాధితుల ఫిర్యాదులపై లోతైన దర్యాప్తు జరిపిన సైబర్ క్రైమ్ పోలీసులు, అక్రమ డబ్బు లావాదేవీలకు ఉపయో గించిన 151 బ్యాంకు ఖాతాల నెట్‌వర్క్‌ను గుర్తించారు.
పెరిగిపోతున్న నేర ముఠాలను ఛేదించేందుకు అనుభవజ్ఞులైన అధికారుల తో 32 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి... మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, హర్యానా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, అస్సాం, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో 10 రోజుల పాటు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. స్థానిక పోలీసుల సమన్వయంతో కీలక నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా అరెస్టైన వారిలో 86 మంది మ్యూల్ ఖాతాదారులు,17 మంది ఖాతా సరఫరాదారులు, అగ్రిగేటర్లు,ఒక బ్యాంకు అధికారి ఉన్నారు.
వీరికి దేశవ్యాప్తం గా నమోదైన 1,055 సైబర్ మోసం కేసులతో సంబంధం ఉన్నట్లు పోలీసులు వెల్లడిం చారు. మొత్తం రూ.127 కోట్లకు పైగా మోసాలు జరిగినట్లు గుర్తించారు. అక్రమ నిధులను లేయరింగ్, లాండరింగ్ చేయడానికి బ్యాంకు ఖాతాలను ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. సైబర్ నేరాలు కేవలం ఆర్థిక నష్టం మాత్రమే కాదు, కుటుంబాల సామాజిక,ఆర్థిక స్థితిని దెబ్బతీసే ప్రమాదమని పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జీరో టాలరెన్స్ విధానంతో చర్యలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ ఆపరేషన్ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుం దనీ, సిండికేట్‌ల ఉన్నత స్థాయి నిందితులపై కూడా దర్యాప్తు జరుగుతోందని హైదరాబాదు సిపి సజ్జనార్ తెలిపారు.




.webp)


