Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఈటల సంచలన వ్యాఖ్యలు.. అంతగా బాధపెట్టిందెవరో?
posted on: Mar 21, 2021 9:22PM
తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొంత కాలంగా టీఆర్ఎస్ లో రాజేందర్ అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఆరు నెలల క్రితం ఆయన చేసిన కామెంట్లు కారు పార్టీలో కలకలం రేపాయి. గులాబీ జెండాకు తామే ఓనర్లమన్న ఈటల వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనమయ్యాయి. కేసీఆర్ పై ఈటల తిరుగుబాటు చేస్తారనే చర్చ జరిగింది. అయితే ఆ వివాదం అక్కడితోనే ముగిసిపోయింది. అయినా పార్టీ కార్యక్రమాల్లో గతంలో లాగా చురుకుగా పాల్గొనడం లేదు ఈటల. తన మంత్రిత్వ శాఖ వరకే పరిమితమవుతున్నారు.
తాజాగా తన సొంత నియోజకవర్గంలో జరిగిన సభలో మాట్లాడుతూ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు ఈటల రాజేందర్. కులం, డబ్బు, పార్టీ జెండాను కాదని, మనిషిని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. ధర్మం, న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చు కానీ శాశ్వతంగా ఓడిపోదని రాజేందర్ చెప్పారు. తాను గాయపడినా తన మనసు మార్చుకోలేదన్నారు. 20 ఏళ్ల ప్రస్థానంలో ప్రజలు తనను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లారని తెలిపారు. ‘‘ఊరంతా ఒక దారి అయితే ఊసరవల్లికి ఒక దారి అన్నట్లు కొంతమంది ఉంటారు. మహాభారతంలో కౌరవులు, ధుర్యోధనుడు ఉండబట్టే పాండవులకు అంత పేరు వచ్చింది. రామాయణంలో కూడా రాముడు ఉన్నాడు. రావణుడు ఉన్నాడు. అలాగే మన సమాజంలో కూడా అందరూ ఉంటారు. అందరూ ఒకే విధంగా ఉండరు. సమాజం ఆనాటి నుండి ఈనాటి వరకు మొత్తం ఒకటిగా ఉండదు, ఉంటే అది సమాజం కాదు. నాయకులంటే భారీ ఆకారంతో, అభరణాలతో, కులంతో పని ఉండదు ప్రజల కన్నీళ్ళు చూసి స్పందించే వాడే నిజమైన నాయకుడు, నిజమైన మనిషి.’’ అని మంత్రి ఈటల తెలిపారు.
హుజూరాబాద్ నియోజక వర్గం వీణవంక మండలం రైతు వేదికలను ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు. తాను గాయపడినా తన మనసు మార్చుకోలేదన్న వ్యాఖ్యలపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. పార్టీలో తాను గాయపడినట్లు రాజేందర్ చెప్పారని అంటున్నారు. అయితే పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంట నడిచిన ఈటలను గాయపరిచింది ఎవరూ అన్న చర్చ జరుగుతోంది. ఎలాంటి గాయం అయింది.. ఎందుకు మనసు మార్చుకోలేదన్న దానిపైనా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా సంచలన వ్యాఖ్యలతో మరోసారి టీఆర్ఎస్ లో , తెలంగాణ రాజకీయాల్లో కాక రేపారు ఈటల రాజేందర్.






