సమరదీక్షకు అనుమతి నిరాకరించిన పోలీసులు

 

తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్దంగా, శాంతియుతంగా తాము దీక్షలు చేసుకొంటామంటే నిరాకరించడం తమ హక్కులను కాలరాయడమేనని అన్నారు. ఒకవైపు సమైక్యాంద్రావాదుల సభలకు ఎటువంటి అభ్యంతరమూ తెలుపని ప్రభుత్వం తమ సభలు సమావేశాలకు మాత్రం అభ్యంతరం తెలపడాన్ని వారు ఆక్షేపించారు. ప్రభుత్వం పక్షపాత వైఖరితో ప్రవర్తిస్తూ తమ తెలంగాణా గడ్డపై తమకు స్వేచ్చ లేకుండా చేస్తోందని ఆరోపించారు.

 

అయితే, గతంలో ప్రొఫెసర్ కోదండరాం వంటి నేతలు, తెలంగాణా కు చెందిన కాంగ్రెస్ నేతలతో, మంత్రులతో ప్రభుత్వంపై తీవ్రమయిన ఒత్తిడితెచ్చి సాగించిన ‘మిలియన్ మార్చ్’ సందర్భంగా ఎదురయిన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొనే అనుమతికి నిరాకరించి ఉండవచ్చును. మరో రెండు రోజుల్లో అంటే జనవరి 28వ తేదిన కేంద్రప్రభుత్వం ఎటువంటి సానుకూల ప్రకటన చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని ప్రభుత్వాన్ని బెదిరిస్తున్న తెలంగాణా నేతల హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని, ఇటువంటి కీలక తరుణంలో సమరదీక్షలకు అనుమతినీయడం ఆత్మహత్యా సదృశ్యమే అవుతుందని ప్రభుత్వం భావించినందువల్ల కూడా వారికి అనుమతి నిరాకరించి ఉండవచ్చును. నిన్న రాజమండ్రీలో ఉండవల్లి అద్వర్యంలో సమైక్యాంద్రా వాదుల సభకు ప్రభుత్వం అనుమతినీయడం, తమకు అనుమతి నిరాకరించడం కూడా తెలంగాణా నాయకులకు ఒక ఆయుధంగా మారిందని భావించవచ్చును. అయితే, రాజధానిలో శాంతి భద్రతలే ముఖ్యం గనుక ప్రభుత్వం అనుమతి నిరాకరించాడానికే మొగ్గు చూపిందని భావించవచ్చును.