TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

స్థానిక ఎన్నికలకు హైకోర్టు బ్రేక్

Published on: Thu Oct 9, 2025 4:38PM

తెలంగాణ హైకోర్టులో రేవంత్ సర్కార్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక ఎన్నికల నిర్వహణకు హైకోర్టు బ్రేక్ వేసింది.   స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ సర్కార్ జారీ చేసిన జీవో 9పై హైకోర్టు స్టే విధించింది. జీవో 9పై పలు పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి.వీటిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం మంగళవారం (అక్టోబర్ 9)న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్‌ తాత్కాలికంగా నిలిచిపోయింది.

రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం తరఫున సమగ్రమైన కౌంటర్‌ను దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.  అంతకుముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో విచారణలో భాగంగా ఏజీ సుదర్శన్‌రెడ్డి తన వాదనలు వినిపిస్తూ..  57.6 శాతం బీసీ జనాభా ఉందని సర్వేలో తేలిందనీ,  బీసీల సంఖ్యపై ఎలాంటి అభ్యంతరం లేనప్పుడు పిటిషనర్లకు నివేదిక ఎందుకని వాదించారు. అలాగే రిజర్వేషన్ల బిల్లుపై ఒక్క పార్టీ కూడా అభ్యంతరం తెలపలేదన్నారు. అలాగే నిర్ణీత గడువులోగా గవర్నర్‌  ఆమోదించకపోతే దానిని చట్టంగా భావించాల్సి ఉంటుందని వాదించారు.

తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అవసరం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైందని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చిన  సుదర్శన్‌ రెడ్డి, నోటిఫికేషన్‌ విడుదలయ్యాక కోర్టులు జోక్యం చేసుకోలేవన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణాను అనుసరిస్తూ కులం వివరాలను జనగణనలోకి తీసుకోనుందని వివరించారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వేరు.. లోకల్‌ బాడీ ఎన్నికల రిజర్వేషన్లు వేరని వాదించారు. తెలంగాణ ప్రభుత్వం  రాజకీయ రిజర్వేషన్ల కోసమే జీవో  తెచ్చిందని వాదించారు.