ఆందోళనలో తెలంగాణ ప్రభుత్వం... లెక్క తప్పుతోన్న అంచనాలు

 

2019-20 బడ్జెట్ పై సీఎం కేసీఆర్ తర్జనభర్జనలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఆర్ధిక మాంద్యంతో ఎన్నికల హామీల అమలు కత్తి మీద సాములా మారిందనే మాట వినిపిస్తోంది. అందుకే ఆదాయం, ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా కచ్చితమైన లెక్కలతో బడ్జెట్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అయితే, ఎన్నికల హామీల అమలు, సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపు అంత సులువు కాదంటున్నారు అధికారులు. ఆర్ధిక మాంద్యంతో ఇప్పటికే ఆదాయం పడిపోవడంతో, అది ముందుముందు ఏ స్థాయిలో ఉంటుందో అంచనాకి రాలేకపోతున్నారు.

గత రెండు నెలలుగా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో భారీగా కోత పడింది. దాంతో తెలంగాణ ప్రభుత్వం ఇబ్బందులను ఎదుర్కొంటోంది. వివిధ అభివృద్ధి పనులకు చెల్లింపులు నిలిచిపోయాయి. ఒకవైపు భారీ సాగునీటి ప్రాజెక్టులు... మరోవైపు పెన్షన్లు, రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, నిరుద్యోగ భృతి లాంటి సంక్షేమ పథకాలు....ఇంకోవైపు కొత్తగా ఇచ్చిన ఎన్నికల హామీలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని భయపెడుతున్నాయి. ముఖ్యంగా ఒక్క రైతు రుణమాఫీకే 24వేల కోట్లు అవసరమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు... ఇక ఉద్యోగుల పీఆర్సీ అమలు చేస్తే మరో భారం... మరోవైపు మిషన్ భగీరథ, నీటి, విద్యుత్ ప్రాజెక్టుల కోసం తెచ్చిన అప్పుల వాయిదాలు చెల్లించడం మొదలవడంతో... వీటన్నింటికీ కేటాయింపులు చేయడం అంత ఈజీ కాదంటున్నారు.

ఆర్ధిక మాంద్యంతో కేంద్రం నుంచి రావాల్సిన వాటా నిధులు తగ్గిపోయి, రాష్ట్ర ఆదాయం కూడా తగ్గిపోతే తెలంగాణ ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందులు తప్పవని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. అయితే, పరిస్థితి చేయి దాటకముందే అప్రమత్తం కావాలని, లేకపోతే ఆర్ధిక ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ తగ్గిన ఆదాయానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఉంటే, భారీ ప్రాజెక్టులు, వివిధ సంక్షేమ పథకాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.