సాగర్ ప్రక్షాళనకు సుప్రీం బ్రేక్

 

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఒక మంచి పనికి కూడా అవరోధాలు తప్పడం లేదు. హైదరాబాద్ నగరానికే తలమానికంగా నిలిచిన హుస్సేన్ సాగర్ ఒక పెద్ద మురికికూపంగా మారిపోవడంతో దానిని పూర్తిగా ప్రక్షాళన చేసి మళ్ళీ స్వచ్చమయిన మంచినీటితో నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకొంది. అందుకోసం ముందుగా హుస్సేన్ సాగర్ తో అనుసంధానమయున్న కాలువలను శుభ్రం చేసి చెరువులో ఉన్న మురికినీరును బయటకు పంపిస్తున్నారు. కానీ జాతీయ పర్యావరణ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) ఆదేశాలకు విరుద్ధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ హుస్సేన్‌ సాగర్‌ను ఎండగడుతున్నాయంటూ హైదరాబాద్ కి చెందిన ‘సేవ్‌ అవర్‌ అర్బన్‌ లేక్స్‌ (సోల్‌)’ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి లుబ్నా సర్వత్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో హుస్సేన్ సాగర్ ని పూర్తిగా ఎండగట్టవద్దని, కాలువల మరమ్మత్తులకు అవసరమైనంత మేరకు మాత్రమే నిర్మాణ పనులు చేయాలని, ఇందుకు అవసరమయితే సాగర్‌ నుంచి కొంత మేరకు నీటిని వదలొచ్చునని జీహెచ్‌ఎంసీకి ఆదేశాలు ఇచ్చింది. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కోసం ఎన్‌జీటీ ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి ఆ ప్రక్రియపై ఒక నివేదికను ఇవ్వాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.

 

సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలతో హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కార్యక్రమం ఆర్దాంతరంగా ముగిసిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇటువంటి పనులలో విశేష అనుభవమున్న ఆస్ట్రేలియా సంస్థకు చెందిన ప్రతినిధులు, ప్రజలకు, పర్యావరణానికి ఎటువంటి కలుగకుండా హుస్సేన్ సాగర్ ప్రక్షాళన చేస్తామని ముందుకు వచ్చేరు. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఆర్దాంతరంగా నిలిపి వేయకుండా అవసరమయితే విదేశీ సాంకేతిక సహాయం తీసుకొని అయినా పూర్తిచేయగలిగితే బాగుంటుంది.