కేసీఆర్ గారు బకాయిలు చెల్లించండి-పోలీసు శాఖ

 

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉపయోగించిన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాల బకాయిలు చెల్లించాలని కోరుతూ సీఎం కేసీఆర్‌ సహా 33 మంది నాయకులకు,ఆయా పార్టీల కార్యాలయాలకు పోలీసుశాఖ లేఖలు రాసింది. ఈ మేరకు ఆదివారం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. దీనిపై డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ..కేంద్ర ఎన్నికల సంఘ ఆదేశాల మేరకు.. గత ఏడాది సెప్టెంబరు 6 నుంచి డిసెంబరు 7 వరకు కేసీఆర్‌ సహా..వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 33 మంది ప్రజాప్రతినిధులకు బుల్లెట్‌ ప్రూప్‌ వాహనాలతో భద్రత కల్పించామని వెల్లడించారు. డ్రైవర్లను కూడా కేటాయించామని అన్నారు. ఈ జాబితాలో కేసీఆర్‌తో పాటు మాజీ స్పీకర్‌ మధుసుధనాచారి, మాజీ మంత్రులు, కాంగ్రెస్‌ నేతలు జానారెడ్డి, షబ్బీర్‌అలీ, బీజేపీ నాయకుడు కిషన్‌రెడ్డి, మజ్లిస్‌ నేత అక్బరుద్దీన్‌ ఒవైసీలతో పాటు అన్ని పార్టీల స్టార్‌ క్యాంపెయనర్‌లు ఉన్నారని పేర్కొన్నారు. కిలోమీటర్ల ఆధారంగా ధరను నిర్ణయించామని తెలిపారు. బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలు వాడిన వారిలో ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణించిన మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి రూ.7.7 లక్షలు, తక్కువగా ఉపయోగించిన ఎర్రబెల్లి దయాకర్‌రావు రూ.53 వేలు చెల్లించాల్సి ఉందని వివరించారు.