చట్ట సభలను అపహాస్యం చేస్తున్న ప్రజా ప్రతినిధులు

 

ఊహించినట్లుగానే అన్ని పార్టీలకు చెందిన శాసనసభ్యులు రాష్ట్ర విభజనపై బిల్లుపై సభలోఎటువంటి చర్చ జరగనీయకుండా అడ్డుపడుతూ సభను స్థంబింపజేస్తూ రోజులు దొర్లించేస్తున్నారు. అందుకు ఎవరి కారణాలు వారికున్నాయి. బిల్లుపై చర్చలో పాల్గొంటే అది రాష్ట్ర విభజనను అంగీకరించినట్లే అవుతుందని తెదేపా, వైకాపాలు భావిస్తూ అడ్డుపడుతుంటే, చర్చజరిగితే అది కొత్త సమస్యలు సృష్టించే ప్రమాదం ఉందని తెలంగాణా శాసనసభ్యులు అడ్డుపడుతున్నారు. కానీ, అందరూ కూడా బిల్లుపై చర్చ జరగాల్సిందేనని, కానీ అందుకు ఎదుట పార్టీ వాళ్ళే అడ్డుతగులుతున్నారని వితండవాదం చేస్తూ, చట్టసభలలో చాలా అనుచితంగా వ్యవహరిస్తున్నారు. నిజానికి రాష్ట్ర విభజనను కోరుకొంటున్న తెలంగాణావాదులు, దానిని వ్యతిరేఖిస్తున్న సీమాంధ్ర సభ్యులు కూడా బిల్లుపై ఎటువంటి చర్చ జరిపే ఉద్దేశ్యంలో లేరని స్పష్టమవుతోంది. కానీ, ఆ మాట పైకి అంటే రాజకీయంగా ఇబ్బంది తప్పదు గనుక సభ జరగనీయకుండా రసాబాస చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. బహుశః జనవరి 23వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగి, బిల్లుపై ఎటువంటి చర్చ జరగకుండానే రాష్ట్రపతికి తిప్పి పంపబడవచ్చును. అందువల్ల బిల్లు శాసనసభకు వస్తే అడ్డుకొంటానని చెప్పిన ముఖ్యమంత్రికి కానీ ఆయన అనుచరులకు గానీ ఇక ఆ శ్రమ ఉండకపోవచ్చును. బహుశః అందుకే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సభలో బిల్లుపై చర్చ జరగాలని చెప్పడమే కానీ అందుకు గట్టిగా ఎటువంటి ప్రయత్నమూ చేయదంలేదు.

 

మొత్తం మీద శాసనసభ్యులు అందరూ కలిసి టీ-బిల్లుపై ఎటువంటి ప్రశ్న లేవనెత్తకుండా, ఎటువంటి సూచనలు,సవరణలు చేయకుండా దానిని యధాతధంగా తిప్పిపంపేందుకు సిద్దం అవుతున్నారు. తమ తమ ప్రాంతాల, ప్రజల ప్రయోజనాలను కాపాడవలసిన ప్రజా ప్రతినిధులు, తమ రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవడానికే ఈవిధంగా వ్యవహరించడం కేవలం బాద్యతరాహిత్యమే. విజ్ఞత ప్రదర్శించి లోపభూయిష్టమయిన రాష్ట్ర విభజన బిల్లులో లోపాలను సవరించే ప్రయత్నాలు చేయకుండా, రాజకీయంగా తమకి ఇబ్బందులు కలగకూడదనే ఆలోచనతో దానిని యదా తధంగా త్రిప్పి పంపుతుండటం వలన రెండు ప్రాంతాలకు, ప్రజలకు తీరని నష్టం కలగడం తధ్యం.