టీ-బిల్లులో ట్విస్టులే ట్విస్టులు

 

రాష్ట్ర విభజన జరుగుతున్నతీరు చూసి ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు, చివరికి స్వంత పార్టీ నేతలు కూడా సిగ్గుపడుతున్నపటికీ, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళన్నట్లు ముందుకు సాగిపోతోంది. ఈ ప్రక్రియ మొదలు పెట్టిననాటి నుండి నేటి వరకూ కూడా ఇదొక అధికారిక, రాజ్యాంగ వ్యవహారంలా కాక, కాంగ్రెస్ పార్టీ స్వంత వ్యవహారంలా, ఒక చెత్త సస్పెన్స్ టీవీ సీరియల్లాగా అనేక మలుపులు తిరుగుతూ ముందుకు సాగుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడా పారదర్శకత అనే పదం కనబడకుండా జాగ్రత్తపడుతూ కాంగ్రెస్ అధిష్టానం తెలుగు ప్రజలకి కూడా తెలియకుండా అత్యంత రహస్యంగా వారి రాష్ట్రాన్ని విభజిస్తోంది.


ఇక ఈ పరమ చెత్త సీరియల్లో ఈ రోజు ఎపిసోడ్లో సస్పెన్స్ ఏమిటంటే, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన వద్దకు వచ్చిన తెలంగాణా బిల్లుని ఈరోజే చూసి, రాష్ట్ర శాసనసభకు పంపుతారా? లేక దానిపై ఏవయినా అభ్యంతరాలు వ్యక్తం చేస్తారా? అనేది తేలాలి. ఇక ఈ ఎపిసోడ్లో మరో ట్విస్ట్ ఏమిటంటే, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఆయన ఈ రోజు సాయంత్రమే దక్షిణాఫ్రికాకు రెండు రోజుల పర్యటనకు బయలుదేరబోతున్నారు. రాష్ట్ర విభజన రాజ్యాంగ బద్దంగా జరగడం లేదని ఇప్పటికే ఆయనకు అనేక పిర్యాదులు వచ్చిన కారణంగా, ఆయన దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన తరువాతనే తెలంగాణా బిల్లుని సావకాశంగా పరిశీలించుతారా? లేక కాంగ్రెస్ ఒత్తిడి మేరకు ఈరోజే హడావుడిగా ఆమోదముద్ర వేసేసి శాసనసభకు పంపుతారా? అనేది మరో సస్పెన్స్. ఇంకా ఇటువంటి ట్విస్టులు ఎన్నెన్నిచూడాలో మున్ముందు.