తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం

 

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శనివారం నాడు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం రోజున రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం, కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని గవర్నర్‌ దగ్గరకు దూసుకుని వెళ్ళే ప్రయత్నం చేశారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో గవర్నర్ సరిగా వ్యవహరించలేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో టీఆర్ఎస్ సభ్యులు పోడియం చుట్టూ రక్షణ కవచంలా ఏర్పడి గవర్నర్ ప్రసంగం కొనసాగడానికి సహకరించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సభ్యులకు, టీడీపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య బాహాబాహీ జరిగింది. సభ్యులు ఒకరినొకరు నెట్టేసుకున్నారు. ప్రతిపక్ష సభ్యులు కాగితాలు చించి గవర్న్ మీదకు విసిరారు. గవర్నర్ తన ప్రసంగంతో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న అభివృద్ధి గురించి వివరించారు. ప్రతిపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ వుండటంతో గవర్నర్ తన ప్రసంగాన్ని హడావిడిగా ముగించారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత తెలంగాణ అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడింది.