ఒక్క త్రాటి పైకి వచ్చిన టీ-నేతలు

 

ఒకప్పుడు సమైక్యశక్తిగా కనబడిన సీమాంధ్ర నేతలందరూ ఇప్పుడు తమ స్వప్రయోజనాలను కాపాడుకోవడం కోసం కత్తులు దూసుకొంటుంటే, ఒకప్పుడు కత్తులు దూసుకొన్న తెలంగాణా నేతలందరూ తమ స్వప్రయోజనాలను, పార్టీ జెండాలను పక్కనబెట్టి ఒక్క త్రాటి పైకి వచ్చి చివరి దశకు చేరుకొన్నరాష్ట్ర విభజన, తెలంగాణా ఏర్పాటు ప్రక్రియను విజయవంతంగా ముందుకు తీసుకు వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు.

 

ఈరోజు ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ మంత్రుల క్వార్టర్స్ లో ఉన్న క్లబ్ హౌస్ లో తెలంగాణా ప్రాంత నేతలందరికీ చిన్నవిందు సమావేశం ఏర్పాటు చేసి ఆహ్వానిస్తే తెదేపాతో సహా అన్నిపార్టీలకు చెందిన నేతలు దానికి హాజరయ్యారు. వారంతా ఈ సమావేశంలో శాసనసభలో తెలంగాణా బిల్లుపై అనుసరించవలసిన వ్యూహం, పార్లమెంటులో బిల్లు ఆమోదానికి తగిన మద్దతు కూడగట్టడం, తెలంగాణా బిల్లులో చేయవలసిన సవరణల గురించి చర్చించడం తదితర అంశాలున్నట్లు తెలుస్తోంది. ఇక ఈనెల23న బిల్లు రాష్ట్రపతికి త్రిప్పి పంపేవరకు ఏ పార్టీ కూడా ఎటువంటి కార్యక్రమాలు చెప్పట్టకుండా అందరూ పూర్తిగా బిల్లు ఆమోదం కోసమే కృషి చేయాలని తీర్మానించారు.

 

ఇదే సమయంలో ఏపీఎన్జీవోలు ఈరోజు సీమాంధ్ర బంద్ కు పిలుపునీయగా, వారికి సమాంతరంగా వైకాపా కూడా బంద్ కు పిలుపునిచ్చింది. తెదేపా, కాంగ్రెస్ పార్టీలు ఉద్యోగుల బందుకు సహకరిస్తుంటే, వైకాపా వేరేగా బంద్ నిర్వహించుకొంటోంది. అంటే ఎవరి బంద్ వారిదేనన్నమాట! ఇక ఆరుగురు కాంగ్రెస్ యంపీలు మొదలుపెట్టిన సంకల్పదీక్షకు వివిధ కారణాలతో కొందరు హాజరు కాలేదు. హాజరయిన వారిలో హర్షకుమార్ మాట్లాడుతూ తాము ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నపటికీ తమ పార్టీ చేసిన నిర్వాకానికి తమ రాజకీయ భవిష్యత్ అగమ్య గోచరంగామారిందని, ఎవరు ఏ పార్టీలో ఉంటామో చెప్పలేని పరిస్థితులు దాపురించాయని చెప్పడం చూస్తే వారి సంకల్పం, దీక్షలు ప్రజలను మెప్పించడానికే తప్ప రాష్ట్ర విభజనకు నిరసనగా చేస్తున్నవి కావని స్పష్టం అవుతోంది.

 

తెలంగాణా నేతలందరూ ఒక్క త్రాటిపైకి వచ్చితెలంగాణా సాధన కోసం పోరాడుతుంటే, సీమాంధ్ర నేతలు సమైక్యాంధ్ర కోసమంటూ త్రాడుని చెరోవైపు లాగుతూ తమతమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను మభ్యపెడుతూనే ఉన్నారు.