రాష్ట్రంలో సమైక్య, విభజన సభలు

 

ఈ రోజు రాష్ట్రం ఒక వింత పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకవైపు తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుని డిమాండ్ చేస్తూ 'సకల జన భేరి' సభ జరుగుతుంటే, మరో వైపు అదే సమయంలో, సమైక్యాంధ్ర రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో కర్నూలులో ఎస్టీబీసీ కళాశాల మైదానంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సమైక్య ప్రజాగర్జన సభ జరుగుతోంది. ఇరు సభలు వారి వారి వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ పై హక్కులపై ఇరు సభలు బలమయిన వాదనలు వినిపించాయి.

 

ఇక టీ-సభలో ప్రసంగించిన కేసీఆర్ ఒక ఆసక్తికరమయిన సంగతిని ప్రకటించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పదవీకాలం మరో ఆరు రోజుల్లో(అక్టోబర్ 6) ముగియబోతోందని, అందుకు తనవద్ద ఖచ్చితమయిన సమాచారం ఉందని ప్రకటించారు. అదేవిధంగా రానున్న ఎన్నికల తరువాత కేంద్రంలో బీజేపీ అద్వర్యంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడవచ్చనే సంకేతమిస్తూ, ఒకవేళ యూపీయే ప్రభుత్వం ఎన్నికలలోగా తెలంగాణా ఏర్పాటు చేయకపోతే, తరువాత వచ్చే బీజేపీ రాష్ట్ర ఏర్పాటు చేయడం ఖాయమని చెప్పడం మరో విశేషం.

 

ఒకవైపు కాంగ్రెస్ అధిష్టానంతో ఎన్నికల పొత్తుల ఆలోచనలు చేస్తూనే కేసీఆర్ ఈవిధంగా మాట్లాడటం చూస్తే, ఆయన అవసరమయితే బీజేపీతో జతకట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని స్పష్టం జేస్తోంది. మరి బీజేపీ తెలుగుదేశం పార్టీతో జత కట్టే ఆలోచనలోఉందని తెలిసినప్పుడు, ఆయన ఈవిధంగా మాట్లాడటం విశేషమే. ఆయన ఈ సనదర్భంగా మాట్లాడుతూ తెలంగాణా ఏర్పాటుకి పూర్తి మద్దతు ప్రకటించిన బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

 

ఈ సభలో ప్రసంగించిన కే.కేశవ్ రావు, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తగా, అంతకు ముందు ప్రసంగించిన బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి సుష్మ స్వరాజ్ ను పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సభలో ప్రసంగించిన వక్తలు అందరు సహజంగానే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసి, ఆయనని వెంటనే పదవి నుండి తప్పుకోవాలని డిమాండ్ చేసారు.

 

ఇక సమైక్య సభలో మాట్లాడిన వక్తలందరూ హైదరాబాదుపై తమకు పూర్తి హక్కులు ఉన్నాయని గట్టిగా వాదించారు. విద్యుత్, ఉపాద్యాయ, సాగునీరు,ఆర్టీసీ తదితర విభాగాలకు చెందిన ఉద్యోగ సంఘనేతలు రాష్ట్ర విభజనతో సీమాంధ్ర ప్రాంతానికి ఎటువంటి సమస్యలు వస్తాయో వివరించారు.

 

వారు రాజకీయ పార్టీలన్నిటికి మరోమారు తీవ్ర హెచ్చరికలు జారీ చేసారు. రాజకీయాలు పక్కనబెట్టి ఇప్పటికయినా స్పష్టమయిన సమైక్యవాదంతో ముందుకు రానట్లయితే రానున్న ఎన్నికలలో గట్టిగా బుద్ధిచెపుతామని హెచ్చరించారు.

 

రెండు సభలలో కొట్టవచ్చినట్లు కనబడిన తేడా ఏమిటంటే, టీ-సభలో తెరాస, బీజేపీ, ఇతర తెలంగాణా ఫోరం నేతలందరూ పాల్గొనగా, సమైక్య సభలో రాజకీయపార్టీలన్నీ దూరంగా ఉన్నాయి. పైగా నేతలకీ, వారి పార్టీలకు ఉద్యోగులు తీవ్ర హెచ్చరికలు చేసారు. అయితే ఉద్యోగులు రాజకీయ నేతలను, పార్టీలను దూరం ఉంచినప్పటికీ, అన్ని ఉద్యోగ సంఘాల నేతలు తమ నేత అశోక్ బాబుకు విస్పష్టంగా తమ మద్దతు ప్రకటించడం ద్వారా పూర్తి ఐకమత్యం చూపుతూ, తమ పోరాటానికి రాజకీయ పార్టీల అండ అవసరం ఎంతమాత్రం లేదని స్పష్టం చేసారు.