ఎంసెట్‌ లీకేజీకి కారణం ఎవరు!

 

తమ పిల్లలు ఒకప్పుడు సమాజానికి సేవ చేసేందుకు వైద్యులుగా మారాలని పెద్దలు కోరుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. విలువలే మారాయో లేకపోతే డబ్బుతో పాటుగా పెరిగిపోతున్న సుఖాలే వారి కళ్లను కమ్మేస్తున్నాయో కానీ... అందినంత సంపాదించుకునేందుకు తమ బిడ్డలు వైద్యలుగా మారాలని చాలామంది తల్లిదండ్రులు తపించిపోతున్నారు. ఇప్పుడు వారికి కావల్సింది అట్టడుగు వర్గాలకు వైద్య సేవలను అందించడం కాదు, సమాజంలో అన్నింటికంటే పైమెట్టుని చేరడం. ఇప్పుడు పెద్దల దృష్టిలో వైద్యుడు అంటే బాగా సంపాదించేవాడు, ఎడాపెడా కమీషన్లను గుంజుకునేవాడు, మంచి హోదాని సాధించేవాడు, వీలైనంత కట్నాన్ని చేజిక్కించుకునేవాడు. ఇలాంటి తల్లిదండ్రుల దృక్పథాలను గమనిస్తూ పెరుగుతున్న పిల్లలు ఇంతకంటే గొప్పగా ఏం ఆలోచిస్తారు. విద్యావైద్య వ్యవస్థలు ఎంతగా కలుషితం అయిపోతున్నాయో చెప్పేందుకు ఎంసెట్‌-2 కుంభకోణమే ఓ నిలువెత్తు సాక్ష్యం!

 

తెలంగాణలోని వైద్య సీట్లను భర్తీ చేసేందుకు నిర్వహించిన ఎంసెట్‌-2లో భారీ అవకతవకలు జరిగాయన్నది ప్రధాన ఆరోపణ. కొందరు దళారులు ప్రశ్నాపత్రాలు ముందుగానే చేజిక్కించుకుని, 35-70 లక్షలకు వాటిని బేరం పెట్టినట్లు ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. అలాంటిదేమీ జరగలేదంటూ తెలంగాణ విద్యామంత్రితో సహా ప్రభుత్వమూ, అధికారులూ ముక్తకంఠంతో చెబుతున్నప్పటికీ... ఏదో గోల్‌మాల్‌ జరిగిందనడానికి బలమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. మీడియా ప్రచురిస్తున్న కథనాలు, ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న వాంగ్మూలాలను పరిశీలిస్తే ఈ కుంభకోణం పక్కా ప్రణాళికతో జరిగిందని తేలిపోతోంది.

 

ప్రశ్నాపత్రాలను లీక్‌ చేసే అవకాశం ఉన్నవారు ముందుగానే కొందరు తల్లిందండ్రులకు ఎరవేసి బేరసారాలు నడిపారు. ముందుగా ఇంత, పని పూర్తయిన తరువాత ఇంత అంటూ హైదరాబాదుకి పిలిపించుకుని మరీ ‘వ్యవహారం’ కుదుర్చుకున్నారు. పరీక్షకు సరిగ్గా వారం రోజులకు ముందరగా విద్యార్థులను హైదరాబాదుకి రప్పించుకుని ప్రశ్నపత్రాలలోని కీలకమైన ప్రశ్నల మీద తర్ఫీదునిచ్చారు. సహజంగానే ఈ విద్యార్థులకు మంచి ర్యాంకులు వచ్చాయడంలో సందేహం లేదు. దానికి నిదర్శనంగా నీట్ (National Eligibility cum Entrance Test) గొడవలో పడి రద్దయిపోయిన తొలి ఎంసెట్ ఫలితాలకీ, ఈ రెండో ఎంసెట్ ఫలితాలకీ అసలు పొంతనే లేకుండా పోయింది.

 

నిజంగానే ఎంసెట్‌ ప్రశ్నాపత్రం లీకైనా అవ్వకున్నా, తెర వెనుక ఏదో భాగోతం నడిచిందని మాత్రం స్పష్టంగా తేలిపోతోంది. దళారులు వలవేసేందుకు ప్రయత్నించడాలు, కొందరు వారి మాటలను నమ్మి లక్షలకు లక్షలు సమర్పించుకోవడాలూ జరిగాయనడానికి సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. పరీక్షను నిర్వహించే బాధ్యత ఉన్న అధికారుల సాయం లేకుండా ఇంత తతంగమూ సాధ్యం కాదు! కాబట్టి ఇక్కడ కేవలం ఎంసెట్‌ లీక్ అవ్వడమే సమస్య కాదని అర్థమవుతోంది. తమ పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లో అయినా వైద్యులు కావాలని కోరుకునే తల్లిదండ్రుల సంకుచిత తత్వం, తమకు కొన్ని డబ్బులు మిగిలితే చాలు... వైద్య రంగంలోకి ఎలాంటివారు చేరినా ఫర్వాలేదనుకునే అధికారులు, డబ్బుల కోసం ఎంత నీచానికైనా పాల్పడే దళారులు, వీటన్నింటినీ చూసీ చూడనట్లు ఊరుకునే ప్రభుత్వ యంత్రాంగం, తనకు అర్హత లేకున్నా అందలాలు ఎక్కాలని ఉవ్విళ్లూరే విద్యార్థులు... అందరూ ఈ తప్పుకి బాధ్యులే!

 

సమాజంలో ఇలాంటి మనస్తత్వానిదే రాజ్యంగా సాగుతోంది కాబట్టి, ఒక్క ఎంసెట్‌ కోచింగ్‌ వ్యాపారమే దాదాపు ఐదువేల కోట్లు ఉంటుందని ఓ అంచనా! మరి ఇంత ఖరీదైన వ్యాపారం మధ్య, ఇలాంటి మనుషుల మధ్య... పేదవాడి ఆరోగ్యం, రూపాయి రూపాయి కూడబెట్టుకునే మధ్యతరగతివాడి బతుకూ ఏమైతే ఎవడికి పట్టింది!!!