త్వరలో తెలంగాణ పరిష్కారం: కెకె

posted on: Oct 26, 2011 9:15AM

హైదరాబాద్: తెలంగాణ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత సీనియర్ నేత కె. కేశవరావు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందిన సీనియర్ మంత్రి కె.జానా రెడ్డితో భేటీ అనంతరం ఆయన  తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పార్లమెంటు సమావేశాలకు ముందా, పార్లమెంటు సమావేశాల్లోనా అనేది తాను చెప్పలేనని, తేదీ తాను చెప్పలేనని, కానీ తెలంగాణ సమస్యను తమ అధిష్టానం త్వరలోనే పరిష్కరిస్తుందని ఆయన చెప్పారు. యుపిఎ భాగస్వామ్య పక్షాల్లోని ఐదారుగురు నాయకులతో,కొంత మంది మంత్రులతో కాంగ్రెసు అధిష్టానం తెలంగాణపై మాట్లాడుతుందని ఆయన చెప్పారు.తెలంగాణ సమస్యను ఫోకస్ చేయడానికి సకల జనుల సమ్మె ఉపయోగపడిందని ఆయన అన్నారు. తాము సమ్మె చేస్తున్న ఉద్యోగులకు సంఘీభావం ప్రకటిస్తూ, ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ తమ బాధ్యత నిర్వహించామని ఆయన అన్నారు. తాము ప్రజల వెంటే ఉంటామని ఆయన అన్నారు.

 లక్ష్యం సాధించినప్పుడే విరమణ ఉంటుందని, తెలంగాణ ఉద్యోగులు ఉద్యమానికి విరామం అంటారో సమ్మె వాయిదా అంటారో తనకు తెలియదు గానీ తాము ఉద్యమంలో ముందుంటామని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో తమ ప్రత్యక్ష భాగస్వామ్యం ఉంటుందని ఆయన చెప్పారు.మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీక్షకు తమ మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు. తెలంగాణ జెఎసిలో సమన్వయం లోపించిందని ఆయన విమర్శించారు. కాంగ్రెసు వల్లనే తెలంగాణ వస్తుందని ఆయన అన్నారు. సమ్మె విమరణతో తెలంగాణ ఉద్యమం వేడి తగ్గలేదని ఆయన అన్నారు. త్వరలో తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన చెప్పారు.కాంగ్రెసు ఎన్నికల ప్రణాళికలో తెలంగాణ ప్రస్తావన ఉందని ఆయన చెప్పారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...