పోలవరం ప్రాజెక్టుకు సహకరించాలని విజ్ఞప్తి : బొత్స

posted on: Oct 25, 2011 3:47PM

హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులు చేపట్టక పోవడం తప్పేనని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ  అన్నారు. అయితే జాతీయ ప్రయోజనాల దృష్ట్యా పోలవరం ప్రాజెక్టును ఎవరూ అడ్డుకోవద్దని పూర్తి చేయడానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇది రాష్ట్రానికి బహుళ ప్రయోజనాలు కలిగించే ప్రాజెక్టు అన్నారు. పోలవరం డిజైన్ మార్చాలనడం తగదన్నారు. ఇప్పుడు ఎత్తు తగ్గింపు, స్థలం తగ్గింపు సాధ్యం కాదన్నారు. ప్రాజెక్టులు కట్టినప్పుడు ఎంతో కొంత నష్ట పోవడం సహజమేనని కాబట్టి ముంపు బాధితులను ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుందన్నారు.రాజకీయ లబ్ధి కోసం ప్రాజెక్టును అడ్డుకోవద్దని కోరారు. సుప్రీం కోర్టు వద్దంటే ఎవరైనా ప్రాజెక్టులు కట్టే సాహసం చేస్తారా అని ప్రశ్నించారు. టెండర్ల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. పోలవరం కట్టవద్దని సుప్రీం కోర్టు చెప్పలేదన్నారు. అలా చెబితే ప్రభుత్వం టెండర్లు పిలిచే సాహసమే చేయదన్నారు. టెండర్ల వివాదం కేసు హైకోర్టులో నడుస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు చెందిన నమస్తే తెలంగాణ పత్రికలో పెట్టుబడులు పెట్టిన వారికే టెండర్లు దక్కినట్లు తనకు తెలియదన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...