TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అక్కడా తెలంగాణవాదమే గెలిచింది

Published on: Thu Mar 22, 2012 11:59AM

మహబూబ్‌నగర్: మహబూబ్ నగర్ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్ రెడ్డి అద్భుత విజయం సాధించారు. కొవూరుతో సహా మిగిలిన అన్ని నియోజకవర్గాలలో గెలుపును అందరూ ఊహించిందే. అయితే మహబూబ్ నగర్‌లోనూ టిఆర్ఎస్ గెలుస్తుందని అందరూ భావించారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా తన సర్వేలో అదే చెప్పారు. తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు సొంత నియోజకవర్గం కావడంతో అక్కడ టిఆర్ఎస్ గెలుపు ఖాయమనుకున్నారు. అయితే అనూహ్యంగా ఫలితం తారుమారయింది. అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తూ బిజెపి విజయం సాధించింది. ఇటీవలి క్రితం వరకు అసలు పోటీకి దిగాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్న బిజెపి ఏకంగా పాలమూరులో పాగా వేసింది.

బిజెపి విజయానికి పలు కారణాలు చూపిస్తున్నారు. కెసిఆర్ వైఖరి, అభ్యర్థికి కలిసొచ్చిన సామాజికవర్గం, ప్రత్యర్థి పార్టీలలో క్రాస్ ఓటింగ్ ఇలా అనేక కారణాలు కనబడుతున్నాయంటున్నారు. మహబూబ్‌నగర్ ఎంపిగా గెలిచినప్పటి నుంచి మళ్లీ నియోజకవర్గం వైపు కెసిఆర్ కన్నెత్తి కూడా చూడకపోవడం, అదే సమయంలో జాతీయ పార్టీ అయిన బిజెపి కూడా తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపించడంతో పాలమూరు ప్రజల దృష్టి అటువైపు మళ్లిందని అంటున్నారు. దివంగత ఎమ్మెల్యే రాజేశ్వర రెడ్డి గతంలో బిజెపి జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. కానీ, ఆయన కుటుంబ సభ్యుల పట్ల కాంగ్రెస్‌పార్టీ అనుసరించిన వైఖరితో ఆయన అనుచరులు తీవ్ర మనస్తాపానికి గురై శ్రీనివాస రెడ్డికి బాసటగా నిలిచారు. ఆయన సామాజిక వర్గం కూడా అండగా నిలిచినట్లుగా కనిపిస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి సాగించిన తెలంగాణ పోరుయాత్ర సెంటిమెంటు పరంగా ఆదరణ పెంచింది. ఇక టిఆర్ఎస్ అధినేత స్థానిక ఎంపి కెసిఆర్ వ్యవహార శైలితో స్థానికులు విసిగి వేసారని అంటున్నారు.

కాగా, పాలమూరులో టీఆర్ఎస్ ఓడిపోయిందనుకోవటంలేదని ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. అక్కడా తెలంగాణవాదమే గెలిచిందని చెప్పారు. "మహబూబ్‌నగర్‌లో మేమూ , బీజేపీ పోటీపడ్డాం. చివరికి తెలంగాణవాదమే గెల్చింది. రెండుపార్టీలకు కలిపి 70% ఓట్లు వచ్చాయి. సాంకేతికంగా అక్కడ మేం ఓడిపోయినా.. గెలిచింది తెలంగాణ వాదమే కదా'' అని వ్యాఖ్యానించారు. "ఉద్యమ పతాకాన్ని హిమాలయాలంత ఎత్తుకు తీసుకెళ్లిన తెలంగాణ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇదే స్ఫూర్తితో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు లక్ష్య సాధన వరకు ముందుకు సాగాలి'' అని ఉద్ఘాటించారు. తెలంగాణ ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే అన్న కాంగ్రెస్‌కు ఉప ఎన్నికల తీర్పు చెంపపెట్టని, వచ్చిన రాష్ట్రానికి అడ్డుపడ్డ టీడీపీ రెండుకళ్ల సిద్ధాంతం చెల్లదని ప్రజలకు చెంప ఛెళ్లుమనిపించారని విమర్శించారు. ఎన్నికల్లో గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా తమ భవిష్యత్తు ప్రయాణం, ప్రస్థానం కొనసాగుతుందన్నారు. తెలంగాణ సాధించే వరకు విశ్రమించేది లేదన్నారు.