Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కడప మహానాడు కమిటీల్లో తెలంగాణ టీడీపీ నేతలు.. సంకేతమదేనా?
posted on: May 22, 2025 4:23PM

తెలుగుదేశంపార్టీ ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు కడపలో నిర్వహించనున్న పార్టీ పండుగ మహానాడులో తెలంగాణ పార్టీ నేతలకు సముచిత స్థానం ఇచ్చింది. మహానాడు కోసం వేసిన 19 కమిటీలలోనూ తెలంగాణ తెలుగుదేశం నేతలకు స్థానం కల్పించింది. అంతే కాకుండా తెలంగాణ అంశాలపై కూడా ఈ మహానాడులో విస్తృతంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చే విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించినట్లు చెబుతున్నారు.
తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని, తీసుకొస్తానని చంద్రబాబు ఇప్పటికే పలు సార్లు బహిరంగంగా ప్రకటించారు. రాష్ట్రంలో పార్టీ క్యాడర్ చాలా బలంగా ఉన్నప్పటికీ పార్టీ కార్యక్రమాలను ముందుండి నిర్వహించే నాయకులకే కొరత ఉందన్నది తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే మహానాడులో తెలంగాణలో పార్టీ పటిష్టతపై కూడా చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. అందులో భాగంగానే మహానాడు కమిటీల్లో తెలంగాణ పార్టీ నేతలకు చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారంటున్నారు. మహానాడు ఆహ్వాన కమిటీలో తెలంగాణ మాజీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు, తీర్మానాల కమిటీలో నన్నూరి నర్సిరెడ్డి, చిలువేరు కాశీనాధ్, సామ భూపాల్ రెడ్డికి స్థానం కల్పించారు. అలాగే వసతుల కమిటీలో పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్, సనగాల సాంబశివరావు, షేక్ అరిఫ్ లకు, మహానాడు వేదిక కమిటీలో నందమూరి సుహాసిని, నన్నూరి నర్సిరెడ్డికి అవకాశమిచ్చారు. భోజనాల కమిటీలో కూరపాటి వెంకటేశ్వర్లు, బండి పుల్లయ్య, అజ్మీరా రాజునాయక్, జనగాం నర్సింగరావు సభ్యులుగా ఉన్నారు. సోషల్ మీడియా కమిటీలో తెలంగాణ తెలుగుదేశం నేతలు తిరునగిరి జ్యోత్స్న, కాట్రగడ్డ ప్రసూన, ప్రకాష్ రెడ్డి, ఆర్ధిక వనరుల కమిటీలో గడ్డి పద్మావతి, నెల్లూరి దుర్గాప్రసాద్ కు చోటుకల్పించారు. వీళ్ళే కాకుండా ఇంకా అనేక కమిటీల్లో తెలంగాణ నేతలకు చంద్రబాబు అవకాశాలు కల్పించారు. అవకాశాలు కల్పించటమే కాకుండా తెలంగాణలో పార్టీ బలోపేతానికి మహానాడులో తీర్మానాలు కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లోను సభ్యత్వ నమోదు కార్యక్రమం నిరాఘాటంగా జరుగుతునే ఉంది. పార్టీవర్గాల సమాచారం ప్రకారం తెలంగాణ తెలుగుదేశం పార్టీకి దాదాపు 4 లక్షల సభ్యత్వాలున్నాయి. కడపలో మహానాడు తర్వాత ఇక జాప్యం లేకుండా తెలంగాణలో పార్టీ పటిష్ఠతకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు గట్టిగా నిర్ణయించుకున్నారంటున్నారు. తెలంగాణలో ఎంపికచేసిన నియోజకవర్గాల్లో విస్తృతస్ధాయి సమావేశాలు నిర్వహించాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీకి గట్టి పట్టు ఉన్న రంగారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో ఎంపిక చేసిన నియోజకవర్గాలలో ఈ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిం చాలని చంద్రబాబు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారని తెలుగుతమ్ముళ్లు చెబుతున్నారు.



.webp)


