TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టీడీపీ ఆఫీసుపై దాడి కేసు .. సీఐడీ విచారణకు సజ్జల

Published on: Sat May 10, 2025 6:01AM

మంగళగిరి టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేత, అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం (మే9) సీఐడీ ముందు విచారణకు హాజరయ్యారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జలపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి విచారణకు రావాల్సిందిగా సజ్జలకు సీఐడీ నోటీసలు జారీ చేసింది. ఈ క్రమంలో గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి విచారణకు హజరయ్యారు. సజ్జలతో పాటు దేవినేని అవినాష్ కూడా విచారణకు హాజరయ్యారు. మరోవైపు సజ్జల విచారణ నేపథ్యంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి సీఐడీ కార్యాలయం వద్దకు వచ్చారు. దీంతో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సీఐడీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

2021 అక్టోబరు 19న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ మూకలు దాడికి తెగబడటం తీవ్ర కలకలం రేపింది. పార్టీ కార్యాలయంలోకి ప్రవేశించిన వైసీపీ శ్రేణులు విధ్వంసం సృష్టించాయి. వైసీపీ మూకల దాడిపై టీడీపీ నేతలు పోలీసులను ఆశ్రయించారు. అయితే వారి ఫిర్యాదును అప్పటి ప్రభుత్వంలోని పోలీసులు పట్టించుకున్న పాపాన పోలేదు. తిరిగి తెలుగు తమ్ముళ్లపైనే కేసులు పెట్టారు. ఇక వైసీపీ ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంగళగిరి అటాక్‌‌పై సర్కార్ దృష్టి పెట్టింది. ఈ వ్యవహారాన్ని సీఐడీకి అప్పగించింది.

ఈ దాడికి సంబంధించి విచారణను వేగవంతం చేసిన సీఐడీ పలు కీలక ఆధారాలను సేకరించింది. అనేక మందిని అరెస్ట్ చేయడంతో పాటు పలువురిని విచారించారు కూడా. విచారణలో భాగంగా ఈ దాడి వెనక సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్ పాత్ర ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఈ కేసులో సజ్జలను ఏ1గా చేర్చారు. అలాగే సజ్జల, అవినాష్‌‌లకు విచారణకు రావాల్సింది సీఐడీ నోటీసులు జారీ చేసింది.