పవన్‌కు ఒక్క సీటూ కూడా రాదు: జలీల్‌ఖాన్‌

 

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాటన్‌ బ్యారేజ్‌పై కవాతు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన టీడీపీ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. అయితే పవన్ ధీటుగా పలువురు టీడీపీ నేతలు ఇప్పటికే ఆయనకి కౌంటర్ ఇచ్చారు. తాజాగా మరోనేత టీడీపీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ కూడా తనదైన పవన్ కి కౌంటర్ ఇస్తూ విమర్శలను తిప్పికొట్టారు. కవాతు పేరుతో పిచ్చి ప్రేలాపనలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టాలకు ఎదురీదుతూ రాజకీయ అనుభవంతో రాష్ట్రాన్ని నెట్టుకొస్తున్న సీఎం చంద్రబాబును విమర్శించే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలని.. నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. విశాఖ జిల్లాలోని గిరిజన ప్రాంతంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్యకు గురైతే ఇంతవరకు పరామర్శించే తీరిక పవన్‌కు లేదని, దీన్ని బట్టి చూస్తే గిరిజనులపై ఆయనకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోందని విమర్శించారు.

రాజకీయ కుటుంబంలో వారసుడు రాజకీయ నాయకుడు ఎందుకు కాకూడదని ప్రశ్నించారు. పవన్‌, అతని కుటుంబసభ్యులు సినీ హీరోలు ఎలా అయ్యారని అన్నారు. పేదపార్టీ అని చెప్పుకునే పవన్‌కు.. ఆకాశం నుంచి పూలు చల్లించుకునేందుకు డబ్బులు ఎక్కడివని ప్రశ్నించారు. రాజకీయాల్లో హుందాగా మాట్లాడటం నేర్చుకోవాలని హితవు పలికారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి 18 సీట్లు వచ్చాయని, వచ్చే ఎన్నికల్లో పవన్‌కు ఒక్క సీటు కూడా రాదన్నారు. బీజేపీ రాసిచ్చిన స్క్రిప్ట్‌లను పవన్‌ చదువుతారని విమర్శించారు. గత ఎన్నికల్లో వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు సానుభూతి వల్ల 67 సీట్లు వచ్చాయని, ఈసారి 30 సీట్లు కూడా కష్టమేనని జోస్యం చెప్పారు. ప్రజాసమస్యల కంటే ప్రభుత్వంపై విమర్శలకే జగన్‌ ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని జలీల్‌ఖాన్‌ ఆరోపించారు.