సజ్జలకి ముకుల్ రోహత్గి ఎవరో తెలియదంట.. నట బీభత్స బిరుదు ఇవ్వొచ్చు 

టీడీపీ నేత పట్టాభిరామ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. విశాఖ సహా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ చేస్తోందని ఆరోపించారు. ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌పై న్యాయ విచారణకు ప్రభుత్వం సిద్ధమా? అని పట్టాభి సవాల్ విసిరారు.

 

సజ్జల రామకృష్ణారెడ్డి తనకు తాను మేధావిగా భావిస్తున్నారని, ప్రతిపక్షాలవి ఘోరమైన అబద్ధాలన్నట్టు సజ్జల మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సజ్జల ప్రభుత్వ సలహాదారా లేక వైసీపీ అధికార ప్రతినిధా అని నిలదీశారు. మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు రాకూడదంటూ జీవో తీసుకొచ్చిన వారు.. ఇప్పుడు స్వేచ్ఛ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ ప్రభుత్వం మీడియా గొంతునొక్కే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోను ప్రెస్‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా తప్పుపట్టిందన్నారు. అలాగే, గతంలో జగన్మోహన్ రెడ్డి అవినీతికి వ్యతిరేకంగా పోరాడినందుకే.. దమ్మాలపాటి శ్రీధర్‌పై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని పట్టాభిరామ్ ఆరోపించారు.

 

కాగా, ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరిట మాజీ అడ్వోకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ పైనా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తన పేరు చేర్చడంపై దమ్మాలపాటి శ్రీనివాస్‌ హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. దమ్మాలపాటి శ్రీనివాస్‌పై తదుపురి చర్యలపై స్టే ఇచ్చింది. దమ్మాలపాటి తరఫున భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి, శ్యాందివాన్‌ వాదనలు వినిపించారు.

 

దీంతో అధికార పార్టీ నేతలు దమ్మాలపాటి పైనా, కోర్టుపైనా వ్యాఖ్యలు చేస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి అయితే.. ఎవరో ముకుల్ రోహత్గి అనే సీనియర్ లాయర్ ని పెట్టుకున్నారట, ఆయన గంటకి లక్షపైగా, రోజుకి కొట్లలో తీసుకుంటారని వ్యాఖ్యలు చేశారు. అయితే సజ్జల వ్యాఖ్యలకు పట్టాభిరామ్ కౌంటర్ ఇచ్చారు. ముకుల్ రోహత్గి ఎవరో తెలియకుండానే.. అమరావతి రైతులకు వ్యతిరేకంగా మీ ప్రభుత్వం తరఫున వాదించడానికి 5 కోట్లు ఇస్తున్నట్టు జీవో విడుదల చేశారా? అని ప్రశ్నించారు. అంతేకాదు, అవినీతి ఆరోపణల కేసుల్లో జగన్ తరఫున ఆయన వాదించింది మర్చిపోయారా అని నిలదీశారు. ఆయనెవరో తెలియదు, ఆయన గంటకి లక్ష తీసుకుంటారట అంటూ నంగనాచి లాగా కబుర్లు చెబుతున్నారు.. వీళ్ళ నటనకి నట బీభత్స, నట భీకర బిరుదులు ఇవ్వొచ్చు అంటూ పట్టాభిరామ్ విమర్శలు గుప్పించారు.