కన్నా ఇంటి ఎదుట ధర్నా

posted on: Jan 5, 2019 10:54AM

 

గుంటూరులో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న కాకినాడలో సీఎం కాన్వాయ్‌ను అడ్డుకున్నందుకు నిరసనగా ఈరోజు కన్నా ఇంటి ముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ప్రధాని నరేంద్ర మోదీ, కన్నా, బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో తెదేపా ఆందోళనకారుల ఎదుటే కన్నా కూర్చున్నారు. కన్నాకు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడింది. ఒకరినొకరు నెట్టుకున్నారు.  ఓ దశలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై భాజపా నేతలు, కార్యకర్తలు విరుచుకుపడ్డారు. దాడి కూడా చేశారు. ఇరువర్గాలు బాహాబాహీకి దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. తెదేపా కార్యకర్తలను పోలీసులు అక్కడి నుంచి తీసుకువెళ్లారు. కాగా తన ఇంటి ముందు తెదేపా శ్రేణుల ధర్నాపై కన్నా మాట్లాడారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ ఆదేశాలతో తనను చంపేందుకు టీడీపీ కార్యకర్తలు వచ్చారని కన్నా ఆరోపించారు. తన మీద హత్యాయత్నంపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. గతంలో అమిత్‌షా, జగన్‌, పవన్‌పై ఇప్పుడు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. గవర్నర్‌ దృష్టిసారించి రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...