అమ్మ అన్నం పెట్టదు..అడుక్కు తిననివ్వదు

 

విద్యుత్ సంక్షోభంతో నిత్యం రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నా తక్షణమే స్పందించి వారికి భరోసా కల్పించి, అందుకు నివారణ చర్యలు చెప్పట్టకపోగా ఈ విద్యుత్ సంక్షోభానికి ఇంతవరకు రాష్ట్రాన్ని పాలించిన తెదేపా, కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని ఆరోపిస్తూ కాలక్షేపం చేస్తున్నారు. కరెంటు లేక కాళ్ళ ముందే పంటలు ఎండిపోతుంటే, అప్పుల భయంతో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకొంటుంటే మరో మూడేళ్ళు ఓపిక పట్టండి విద్యుత్ సంక్షోభాన్ని పూర్తిగా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇస్తున్నారు. విద్యుత్ సంక్షోభంతో రాష్ట్రం విలవిలలాడుతుంటే, తక్షణమే డిల్లీ వెళ్లి కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి చేసి జాతీయ గ్రిడ్ నుండి అదనపు విద్యుత్ పొందే ప్రయత్నాలు గట్టిగా చేయకపోగా, ఆపని చేసిన తెలంగాణా తెదేపా యంపీ, యం.యల్యే.లను విమర్శిస్తున్నారు.

 

తెదేపా సీనియర్ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపీ గుండు సుధారాణి తదితరులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిల్లీలో ప్రత్యేక ప్రతినిధి కంబంపాటి రామ్మోహన్ రావుతో నేతృత్వంలో కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి పీయూష్ గోయల్, కలిసి తెలంగాణాలో విద్యుత్ సంక్షోభం దాని వలన ఎండిపోతున్న పంటలు, నానాటికి పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలు వంటి పరిస్థితులన్నీ వివరించి తక్షణమే కేంద్ర గ్రిడ్ నుండి తెలంగాణ రాష్ట్రానికి అదనపు విద్యుత్ సరఫరా చేయాలని విజ్ఞప్తి చేసారు. ఆ తరువాత వారందరూ కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి రాధా మోహన్, పట్టణాభివృద్ధి శాఖామంత్రి వెంకయ్య నాయుడు మరియు వాణిజ్యమంత్రి నిర్మలా సీతారామన్ లను కూడా కలిసి పరిస్థితి వివరించి తెలంగాణా రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేసారు.

 

తెలంగాణా ప్రభుత్వం తరపున ఎవరూ వెళ్లి కేంద్రంతో మాట్లాడి అదనపు విద్యుత్ పొందే ప్రయత్నం చేయకపోయినా, అందుకోసం వెళ్ళిన తెదేపా నేతలపై విరుచుకు పడుతున్నారు. “తెదేపా నేతలు మా ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికే పనిగట్టుకొని డిల్లీ వెళ్ళారు తప్ప తెలంగాణా రాష్ట్రానికి కేంద్ర సహాయం కోరేందుకు కాదు” అని తెరాస యంపీ జితేందర్ రెడ్డి అనడం చూస్తే అమ్మ అన్నం పెట్టదు..అడుక్కు తిననివ్వదన్నట్లుంది. తెలంగాణా ప్రభుత్వమే చొరవ తీసుకొంటే మేమెందుకు డిల్లీ వెళతామని తెదేపా నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికయినా తెలంగాణా ప్రభుత్వం మేల్కొని అన్ని పార్టీల ప్రతినిధులను వెంటబెట్టుకొని డిల్లీ వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అదనపు విద్యుత్ పొందే ఆలోచన చేస్తే బాగుంటుందని ప్రతిపక్షాలు అభిప్రాయపడుతున్నాయి.