TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ టీడీపీ ఎంట్రీ

Published on: Mon Jul 28, 2025 8:50PM

 

తెలంగాణ స్థానిక సంస్థలకు జరగనున్న ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు వాసిరెడ్డి రామనాథం ప్రకటించారు. 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలసి పోటీచేసిన టీడీపీ ఆ తరువాత అన్ని ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది. రానున్న రోజుల్లో తెలంగాణలో టీడీపీ, బీజేపీ, జనసేన కలసి పోటీ చేస్తాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

ఆంధ్రప్రదేశ్ లో ఈ కూటమి ఘనవిజయం సాధించింది. ఇదే తరహాలో తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతాయని చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వాసిరెడ్డి ప్రకటన ఊహాగానాలకు మరింత ఊతం ఇస్తోంది. గత కొన్నిరోజులుగా బీఆర్ఎస్ నేతలు తెలుగుదేశం పార్టీ ని చంద్రబాబును టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. బనకచర్ల ఇష్యూ ను ప్రధానంగా చేసుకొని విమర్శలకు పదునుపెడుతున్నారు. మళ్లీ తెలంగాణ వ్యతిరేకులు అంతా తెలంగాణ పై దాడికి సిద్ధమవుతున్నారని బీఆర్ఎస్ నేతలు కొంత కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

నేడు రామనాథం ప్రకటన బీఆర్ఎస్ నేతల ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీ స్థానిక సంస్థల ఎన్నికల వరకే పరిమితం అవుతుందా … లేక 2028 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీకి దిగుతుందా అనే విషయం తేలాల్సి ఉంది. స్థానిక ఎన్నికల్లో ఫలితాలపైనే భవిష్యత్తు లో తెలంగాణ లో ఎన్డీఏ కూటమి భవితవ్యం ఆధారపడి ఉంటుంది. అయితే స్థానిక ఎన్నికల్లో కూడా రాష్ట్ర మంతా పోటీచేస్తారా లేక ఖమ్మంతో పాటు మరికొన్ని ఎంపిక చేసిన జిల్లాలకే పరిమితం అవుతుందా అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది.