పవన్ కల్యాణ్ తో వైకాపా మైండ్ గేమ్?

 

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న సమస్యల గురించి కానీ, ఆంద్రప్రదేశ్ పట్ల తెలంగాణా ప్రభుత్వ అనుసరిస్తున్న వైఖరి గురించి గానీ ఎన్నడూ మాట్లాడదు. ఒకవేళ మాట్లాడినా తెలంగాణా ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతుందే తప్ప ఎన్నడూ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ప్రజలని సమర్ధించిన దాఖలాలు లేవు. కారణాలు అందరికీ తెలిసినవే. ఇప్పుడు ఆ పార్టీ నేతలు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెదేపాకు అమ్ముడుపోయాడని విమర్శలు గుప్పిస్తున్నారు.

 

ఆయన త్వరలోనే అన్ని అంశాల మీద స్పందిస్తానన్న మాటను పట్టుకొని, “ఈ వ్యవహారాలలో ఏవిధంగా మాట్లాడాలో తెదేపా, బీజేపీ నేతల వద్ద శిక్షణ తీసుకోనేందుకే ఆయన వారం రోజులు సమయం తీసుకొంటున్నారని” వైకాపా నేత నారాయణ స్వామి ఆరోపించారు. “ప్రశ్నిస్తానన్న పెద్దమనిషి ఇంత జరుగుతున్నా ఎందుకు ప్రశ్నించడం లేదు? ఆయన అధికార పార్టీకి అమ్ముడుపోయారా? లేక ప్రశ్నించడం చేతగాక మౌనం వహిస్తున్నారా? మీకు చేతకాకపోతే మేము ప్రశ్నలు అందిస్తాము. మీరే వాటిని సంధించి ప్రభుత్వాం నుండి సమాధానాలు రాబట్టాలని” ఆయన అన్నారు.

 

ఆంద్రప్రదేశ్ లో తెరాస తరపున వఖల్తా తీసుకొని మాట్లాడుతూ, ఆ పార్టీకి రాష్ట్రంలో అనధికార ప్రతినిధిలాగ వ్యవహరిస్తున్న వైకాపా, అసలు ఇంతవరకు పార్టీనే నిర్మించుకోకుండా రాజకీయ అపరిపక్వమయిన మాటలతో, చేతలతో జనాలను రంజింపజేస్తున్న పవన్ కళ్యాణ్ న్ని పట్టుకొని అధికారపార్టీకి అమ్ముడుపోయారా? అని నిలదీయడం చాలా హాస్యాస్పదంగా ఉంది. పైగా తాము ఇచ్చే ప్రశ్నావళిని ఆయనని డైలాగులు చదివినట్లు చదవమని కోరడం, తమ పార్టీ వ్యూహాలను వేరొక పార్టీ నాయకుడు అమలుచేయాలని కోరుకోవడం అహంకారమేననుకోవలసి ఉంటుంది. ఇదివరకు సమైక్య రాష్ట్ర ఉద్యమాలు చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా తెదేపాతో సహా అన్ని పార్టీలను తన వెనుక నడవమని కోరడం గుర్తుకు తెచ్చుకొంటే అది అర్ధమవుతుంది. అయినా 60 మందికి పైగా ఎమ్మెల్యేలు కలిగి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైకాపా కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా లేని పవన్ కళ్యాణ్ న్ని కూడా తన రాజకీయ చదరంగంలో పావుగా వాడుకోవాలనుకోవడం దివాలాకోరుతనమే.

 

పవన్ కళ్యాణ్ రాజకీయాలలో కొనసాగుతారా...లేదా? ఆయన తెదేపాకు మద్దతు ఇస్తున్నారా...లేదా? అనే విషయాలను పక్కనబెడితే ఆయన రాజకీయ అపరిపక్వత కారణంగానే మొదటి నుండి నేటివరకు కూడా తప్పటడుగులు వేస్తున్నారని అందరికీ తెలుసు. అయితే ఆయన సినీ రంగంలో చాలా పేరున్న హీరో గనుకనే అందరి దృష్టి ఆయనపై ఉంది. అదే ఏ సాధారణ రాజకీయ నాయకుడో ఈ విధంగా వ్యవహరించినా లేదా ఈ వ్యవహారాలపై స్పందిస్తానని చెప్పినా రాజకీయ పార్టీలే కాదు జనాలు కూడా పెద్దగా పట్టించుకోరని అందరికీ తెలుసు. కానీ ఆయన తెదేపాకి పావుగా మారిపోయారని ఆరోపిస్తున్న వైకాపాయే ఆయన రాజకీయ అపరిపక్వతను తెలివిగా ఉపయోగించుకొని ఈ రాజకీయ చదరంగంలో ఆయనను పావుగా వాడుకోవాలని ప్రయత్నిస్తున్నట్లుంది. వైకాపాకి తెదేపాతో సమస్యలుంటే వారే నేరుగా ఆ పార్టీని డ్డీకొంటే బాగుంటుంది కానీ మధ్యలో పవన్ కళ్యాణ్ న్ని పావుగా వాడుకోవాలనుకోవడం రాజకీయ దివాళాకోరుతనమే.