TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కొలిక్కి రాని సీట్ల సర్దుబాట్లు

Published on: Sat Mar 29, 2014 9:12AM

 

తెదేపా-బీజేపీల మధ్య సీట్ల సర్దుబాట్ల చర్చలు ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో వాటి మధ్య ఎన్నికల పొత్తులు కూడా ఇంకా ఖరారు కాలేదు. ఎన్నికలు దగ్గరపడుతున్నా ఇంకా పొత్తుల సంగతి తేల్చుకోలేక తమ అభ్యర్ధులను ప్రకటించలేని పరిస్థితి ఏర్పడితే అది ఇరుపార్టీలకీ కూడా తీవ్ర నష్టం కలిగిస్తుందనే ఆలోచనతో నేరుగా చంద్రబాబుతోనే చర్చలు జరిపేందుకు బీజేపీ నేత ప్రకాష్ జవదేకర్ హైదరాబాద్ వచ్చి చర్చలు జరుపుతున్నారు. తెలంగాణా బీజేపీ నేతలు తెదేపాతో ఎన్నికల పొత్తుకు సముఖంగా లేనప్పటికీ, పార్టీ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా వారి అభ్యంతరాలను పట్టించుకోకుండా బీజేపీ తెదేపాతో పోత్తులకు సిద్దపడుతోంది.

 

తెలంగాణాలో 45 అసెంబ్లీ సీట్లు, 8 లోక్ సభ సీట్లు ఇవ్వాలని, సీమాంధ్రలో 25 అసెంబ్లీ సీట్లు, 5 లోక్ సభ సీట్లు ఇవ్వాలని కావాలని బీజేపీ కోరుతుంటే, తెదేపా మాత్రం తెలంగాణలో 24/6 సీట్లు, సీమాంధ్రలో 8/3 సీట్లు ఇవ్వడానికి మాత్రమే సిద్దంగా ఉంది. ఇవికాక విశాఖ, విజయవాడ, మల్కాజ్ గిరీ మరికొన్ని ముఖ్యమయిన నియోజకవర్గాలలో రెండు పార్టీలకు బలమయిన అభ్యర్ధులు ఉన్నందున ఆ సీట్లు తమకే కావాలని ఇరు పార్టీలు గట్టిగా పట్టుబడుతుండటంతో ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది.

 

అందువల్ల ఆంధ్రా,తెలంగాణా రాష్ట్రాలలో మిగిలిన సీట్ల విషయంలో కొంచెం పట్టువిడుపులు ప్రదర్శించి రెండు పార్టీలు రాజీకి వచ్చినా, ముఖ్యమయిన నాలుగయిదు స్థానాల విషయంలో రాజీపడలేకపోతే మధ్యే మార్గంగా ఆ స్థానాలలో వేర్వేరుగా పోటీ చేసినా చేయవచ్చును. కానీ, ఇది ప్రజలకు, ఉభయ పార్టీల కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు పంపి అయోమయానికి గురిచేసే అవకాశం ఉంది. అంతేగాక వారిని విమర్శించేందుకు వారి ప్రత్యర్ధులకు కూడా మంచి అవకాశం కల్పిస్తుంది గనుక రెండు పార్టీలు సీట్ల సర్దుబాటుకే గట్టిగా ప్రయత్నించవచ్చును. కానీ, ఒకవేళ అలా వీలు కాకపోతే ఆ నాలుగయిదు స్థానాలలో వేర్వేరుగా పోటీ చేసినా చేయవచ్చును. ఏది ఏమయినప్పటికీ రెండు పార్టీలు ఏదోవిధంగా పొత్తులు కుదుర్చుకోవడం మాత్రం ఖాయమని చెప్పవచ్చును.