సెల్వం రాజీనామా, జయలలిత శాసనసభా పక్షనేతగా ఎన్నిక

 

ఈరోజు ఉదయం తమిళనాడు ముఖ్యమంత్రి ఓ. పన్నీర్ సెల్వం గవర్నర్ రోశయ్యను కలిసి ఆయనకి తన రాజీనామా పత్రం సమర్పించారు. దానిని ఆయన వెంటనే ఆమోదించారు. ఆ తరువాత చెన్నైలో జరిగిన అన్నాడీ.యం.కె. పార్టీ శాసనసభ సభ్యుల సమావేశంలో పన్నీర్ సెల్వం స్వయంగా జయలలితను తమ పార్టీ శాసనసభా పక్షనేతగా ప్రతిపాదించగా దానిని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి యన్.ఆర్. విశ్వనాథం బలపరిచారు. మిగిలిన సభ్యులు అందరూ కూడా ఆ ప్రతిపాదనకు మద్దతు తెలపడంతో జయలలిత శాసనసభా పక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ప్రకటించారు. రేపు ఉదయం 11గంటలకు మద్రాస్ యూనివర్సిటీలో ఆమె తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారనే వార్త తెలియగానే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకొంటున్నారు. చెన్నై అంతటా వీధివీధినా ఆమె ఫోటోలున్న పోస్టర్లు, బ్యానర్లు, కటవుట్లు కనబడుతున్నాయి.