టీవీ ఛానల్ ఆఫీసు మీద నాటు బాంబులు
posted on Mar 12, 2015 12:22PM

చెన్నైలోని పుతియా తలైమురై అనే తమిళ టీవీ ఛానల్ కార్యాలయం మీద గుర్తు తెలియని వ్యక్తులు నాటుబాంబులను విసిరారు. ఈ ఘటన తమిళనాడులో సంచలనం సృష్టించింది. గురువారం తెల్లవారు ఝామున ఈ ఘటన జరిగింది. టిఫిన్ బాక్సుల్లో వుంచిన నాటు బాంబులను సదరు వ్యక్తులు టీవీ ఛానల్ కార్యాలయ ఆవరణలోకి విసిరారు. వాటిలో ఒక బాంబు పేలినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. గుర్తు తెలియని వ్యక్తులు బాంబులు విసురుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనలో ఇంతవరకు ఎవరినీ పోలీసులు అరెస్టు చేయలేదు. పుతియా తలైమురై టీవీ ఛానల్లో తాళి అనే వివాదాస్పద కార్యక్రమం ప్రసారం అవుతోంది. ఈ ప్రోగ్రాంని వ్యతిరేకిస్తూ హిందూ మున్నై అనే అతివాద సంస్థ ప్రదర్శనలు కూడా నిర్వహించింది. ఆదివారం నాడు ఈ సంస్థ సభ్యులు ఛానల్ కార్యాలయం మీద దాడిచేసి ఫర్నిచర్ని ధ్వంసం చేయడంతోపాటు కొంతమంది సిబ్బందిని కూడా గాయపరిచారు. ఇప్పుడు ఈ సంస్థ సభ్యులే బాంబు దాడి చేసి వుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.