చింతపండు తగిలితే రక్తపోటు తగ్గిపోతుందా!

 

రక్తపోటు ఉన్నవారు పులుపు ముట్టుకోకూడదని వైద్యులు చెబుతూ ఉంటారు. అయితే వేలసంవత్సరాలుగా మన ఆహారంలో భాగంగా ఉన్న చింతపండుని వదులుకోవాల్సిందేనా! నానారకాల అనర్థాలకీ, అనారోగ్యాలకీ చింతపండు కారణం అవుతోందా! అంటే కాదనే అంటున్నారు నిపుణులు. చింతపండుతో రక్తపోటు పెరగకపోగా తగ్గే అవకాశం ఉందంటున్నారు. ఇంకా ఏమేం చెబుతున్నారంటే...

రక్తపోటు - చింతపండులో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. సోడియం తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా చింత శరీరంలోని రక్తపోటుని అదుపులో ఉంచుతుందన్నది నిపుణుల వాదన. పైగా చింతపండులో పీచుపదార్థం చాలా ఎక్కువ. చింతపండు నుంచి ఎంత గుజ్జు తీసినా కూడా ఇంకా పీచు మిగిలి ఉండటాన్ని గమనించవచ్చు. శరీరంలోని కొవ్వుని తొలగించేందుకు ఈ పీచు చాలా ఉపయోగపడుతుంది.

రక్తహీనత - చింతపండులో ఇనుము (iron) శాతం కూడా చాలా ఎక్కువ. దీని వల్ల శరీరంలో రక్తహీనత తొలగిపోతుంది. ఆ రక్తహీనత కారణంగా వచ్చే నీరసం, తలనొప్పులూ దూరమైపోతాయి.

ఊబకాయం - చింతపండులో hydroxycitric acid అనే రసాయనం ఉందంటారు. ఇది శరీరానికి అందే కార్బోహైడ్రేట్లు, కొవ్వు కిందకి మారకుండా అడ్డుకుంటుంది. పైగా చింతపండుకి LDL కొలెస్టరాల్‌ని తగ్గించే శక్తి కూడా ఉంది. వీటి అర్థం... చింతపండుతో బరువు తగ్గిపోతుందనేగా!

జీర్ణశక్తి - ఇప్పుడంటే మన ఆహారపు అలవాట్లు మారిపోయాయి కానీ, చింతపండుతో చేసిన చారు లేక పులుసు లేకపోతే ఒకప్పుడు భోజనం పూర్తయ్యేది కాదు. మనం తిన్న భోజనాన్ని చక్కగా అరాయించుకునేందుకు ఈ చింతపండు చారు ఉపయోగపడుతుంది. ఇప్పటికీ జీర్ణశక్తి కాస్త మందగిస్తున్నట్లు తోస్తే తక్షణ ఉపశమనం కోసం పెద్దలు చింతపండుతో కాస్త చారుని తినమనే చెబుతారు.

కాలేయం - జ్వరంతో బాధపడేవారికి చింతపండు చారునే పథ్యంగా చెబుతూ ఉంటారు. దీని వెనకాల శాస్త్రీయ కారణాలు లేకపోలేదు. చింతపండు త్వరగా జీర్ణమవుతుంది. అంతేకాదు! చింతపండుకి కాలేయం నుంచి విడుదల అయ్యే పైత్య రసాన్ని (bile) నియంత్రించే శక్తి ఉంది. ఈ పైత్య రసంలో తేడాలే చాలా సందర్భాలలో జ్వరానికి దారితీస్తాయని నమ్ముతారు.

బి విటమిన్‌ - బి విటమిన్లలో ముఖ్యమైన ‘థయామిన్‌’ (B1) చింతపండులో పుష్కలంగా లభిస్తుంది. మెదడు చక్కగా పనిచేయాలన్నా, ఆహారం శక్తిగా మారాలన్నా, ఎర్రరక్త కణాలు ఉత్పత్తి కావాలన్నా, శరీరం యవ్వనంగా కనిపించాలన్నా ఈ థయామిన్‌ చాలా అవసరం.

రోగనిరోధక శక్తి - కేవలం B1 మాత్రమే కాదు C,E,K విటమిన్లు... కాల్షియం, మెగ్నీషియం, పాస్ఫరస్‌, జింక్‌ వంటి ఖనిజాలు కూడా చింతపండులో కనిపిస్తాయి. వీటన్నింటివల్లా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందనీ, ఆరోగ్యం నిలిచి ఉంటుందని వేరే చెప్పాలా!