కళంకిత మంత్రుల ఉద్వాసనతో కాంగ్రెస్ లో కొత్త అధ్యాయాలు

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడి వల్ల హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, రోడ్లు భవనాలు శాఖా మంత్రి ధర్మాన ప్రసాద రావులను తన మంత్రి వర్గం నుండి తప్పించారు. దీనితో ఒక అధ్యాయం ముగియగా, మరిన్ని కొత్త అధ్యాయాలు మొదలు కాబోతున్నాయి. అయితే అవి కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి, ప్రజలకి కూడా మరిన్ని చేదు అనుభవాలను రుచి చూపించబోతున్నాయి.

 

వారిరువురు తమ పదవులతో బాటు శాసన సభకు కూడా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ వారిరువురూ తమ శాసన సభ పదవులకు రాజీనామాలు చేసినట్లయితే, ఇప్పటికే బొటాబొటి మెజార్టీతో నడుస్తున్న కిరణ్ కుమార్ ప్రభుత్వం మైనార్టీలో పడే అవకాశాలున్నాయి. కానీ, ముఖ్యమంత్రి పరిస్థితులు అంతవరకు వెళ్ళనీయక పోవచ్చును.

 

ధర్మాన మరో అడుగు ముందుకు వేసి పార్టీకి కూడా రాజీనామా చేసి వైకాపాలో జేరే అవకాశాలున్నట్లు సమాచారం. ఒకవేళ ఆయన వైకాపాలో చేరినట్లయితే, శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికలలో ఎదురు దెబ్బతప్పక పోవచ్చును. ధర్మాన పార్టీ మారితే శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారవచ్చును.

 

ఇక, మొదటి విడతలో ఇద్దరికి ఉద్వాసన అయింది గనక, మిగిలిన కళంకిత మంత్రులకు కూడా అదే సూత్రం వర్తించక తప్పదు. ఇది వారిలో తీవ్ర అభద్రతా భావం పెంచుతుంది గనుక వారు కూడా అసమ్మతి ముఠాలు కట్టే అవకాశం ఉంది. ఈ విధంగా మొత్తం ఐదుగురు మంత్రులు తప్పుకొంటే, వారు ఖాళీచేసిన కుర్చీలలో రుమ్మాళ్ళు వేయడానికి ఈపాటికే కాంగ్రెస్ పార్టీలో పోటీలు మొదలయి ఉంటాయి. ముఖ్యంగా కీలకమయిన హోం మంత్రి, రోడ్లు భవనల శాఖల కోసం పోటీ గట్టిగానే ఉంటుంది. పదవులు దక్కించుకొన్నవారు పండుగ చేసుకొంటారు. దక్కని వారు అసంతృప్తి ముఠాలుగా ఏర్పడుతారు.

 

ఇక, మంత్రి వర్గ ప్రక్షాళణా కార్యక్రమానికి ముఖ్యమంత్రి డిల్లీ నుండి అనుమతి తెచ్చుకొన్నట్లు వస్తున్న వార్తలు నిజమయితే, ఆయన మొట్ట మొదటిగా తనను వ్యతిరేఖిస్తున్న డా. డీ.యల్. రవీంద్రా రెడ్డి, సి.రామచంద్రయ్య వంటి వారిని మంత్రి పదవుల నుండి తొలగిస్తారు. పదవులలో ఉన్నపుడే కిరణ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న అసమ్మతి నేతలు ఇప్పుడు ఆ పదవులు కూడా కోల్పోతే, పార్టీలో అసమ్మతి మరింత పెరిగే అవకాశం ఉందన్న మాట.

 

ఇక, మంత్రి రామచంద్రయ్యను తొలగిస్తే ఆయన వెనకుండి నడిపిస్తున్నమెగా మంత్రిగారికి కోపం కలిగించవచ్చును. అది పార్టీలో కొత్త ‘కాపు కుల సమీకరణాలకి’ మరింత ఊతమీయవచ్చును. కొండ నాలికకు మందేస్తే ఉన్న నాలిక కూడా ఊడినట్లు, కళంకిత మంత్రులను తొలగించి ప్రజలలో మంచి పేరు తెచ్చుకొందామని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తే, పార్టీలో చిచ్చు పెట్టుకొన్నట్లవుతుంది.

 

పార్టీలో అసమ్మతి కార్యకలాపాలు, మంత్రులలో అభద్రతా భావం, మైనార్టీలో ప్రభుత్వం, కొత్త కుల, రాజకీయ సమీకరణలు వంటివన్నీ జోరందుకొంటాయి. ఈ పరిస్థితులన్నీ అంతిమంగా ప్రభుత్వ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. సాధారణ పరిస్థితుల్లోనే ప్రభుత్వం పని తీరు అంతంత మాత్రంగా ఉన్నపుడు, ఇటువంటి పరిస్థితుల్లో అది మరింత దిగ జారే అవకాశం ఉంటుంది.